పండుగ బొమ్మ ప్రారంభం!
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్, అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి పండుగ వైబ్ కనిపించేలా టీమ్.. ‘జనవరి 13 విడుదల’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.
కీర్తి సురేశ్, కృతిశెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రబృందం, పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో గురువారం జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్టును టీమ్‌కు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్, కళ్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన మొదటి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేశ్‌బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు.
సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఓపెనింగ్ షాట్‌కు దర్శకత్వం వహించారు. అనిల్ రావిపూడి స్టుల్‌లో సాగే వినోదం, నవ్వులతో కూడిన సంక్రాంతి చిత్రంగా ఉండబోతోందీ మూవీ. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.






