కూలింగ్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం
కేటీపీఎస్ ఓ అండ్ ఎం స్క్రాప్ తరలింపులో భాగం
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 720 మెగావాట్ల సామర్థ్యం కల్గిన కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారానికి చెందిన ఏ బీ సీ స్టేషన్ల కూలింగ్ టవర్లను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్లాంట్‌కు కాలం చెల్లిందని, అధికంగా కాలుష్యం వెలువడుతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశానుసారం కేటీపీఎస్‌ను మూసి వేశారు. మూసిన ప్లాంట్‌ను టెండర్ పిలిచి స్క్రాప్‌కింద హెచ్ ఆర్ కంపెనీకి రూ.485 కోట్లకు విక్రయించారు. ఆరు నెలల నుంచి ప్లాంట్ డిస్‌మెటలింగ్ పనులు ముమ్మరం చేసి స్క్రాప్‌ను తరలిస్తున్నారు. అందులో భాగంగానే కూలింగ్ టవర్లను కూల్చివేయడానిక జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అనుమతుల కోసం వేచి ఉన్నారు.






