8 May, 2026 | 3:33 AM

పోరాటయోధుడు పండుగ సాయన్న..

10-12-2024 08:41 PM

భూస్వాములకు, రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మరువలేనిది

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు  నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా పండుగ సాయన్న వర్ధంతి

పటాన్ చెరు (విజయక్రాంతి): నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండుగ సాయన్న అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ మత్స్యశాఖ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు.

ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకురవడంతోనే సాయన్నకు పండగ సాయన్న అని పేరు వచ్చిందన్నారు. ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదురొడ్డి బహుజనులకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.