13-12-2024 12:00:00 AM
‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘తొలి రాష్ట్ర మహాసభ’ రేపు మహబూబ్‌నగర్‌లోని క్రౌన్ ఫంక్షన్ హాలులో జరగనుంది. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం వరకు కొనసాగనున్న వివిధ సమావేశాలలో ప్రముఖులు ఎందరో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి ‘బహుళ అస్తిత్వాలు జాతీయవాద సవాళ్లు’, ‘లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి సమాజం, సాహి త్యం’ అంశాలపై ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. “ఎంతో భిన్నత్వం, వైవిధ్యం ఉన్నచోట ప్రజాస్వామ్య హక్కు అయిన స్వేచ్ఛకు భంగం కలుగకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగం మతస్వేచ్ఛకు చట్టపరంగా హామీ ఇచ్చింది. కానీ, కాలక్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే మతతత్వ రాజకీయా లు ప్రాబల్యం వహిస్తూ ముందుకొచ్చాయి.
లౌకిక సమత్వ భావనలను రాజ్యాంగం నుంచి తొలగించడానికి అవి విదేశీ భావనలని సాకు చూపడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నిజానికి భారతదేశ చరిత్ర గమనంలో వీటి జాడలు ప్రజల జీవన సంస్కృతిలో భాగమై వున్నాయి. అయితే, ఈ తరుణంలోనే ప్రత్యామ్నాయ ఆలోచనా ధారను ఈనాటి మత రాజకీయాలు మింగివేస్తున్నాయి. ఆధ్యాత్మికతకు అర్థమే మారిపోయి, మదిలో మాత్రమే ఉండాల్సిన భక్తి వీధుల్లోకి వచ్చి మనుషులపై దాడులకు తెగబడి స్తురైవిహారం చేస్తోంది. పరమత అసహనం, పరమత విద్వేషమే భక్తిగా, దేశభక్తిగా చలామణీ అవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి-, సాహిత్యంపై ఆలోచనలు కలబోసుకునేందుకు ఈ తొలి రాష్ట్ర మహాసభలు ఉపయోగపడగలవు” అని వారు తమ ప్రకటనలో తెలిపారు.
ఉదయం ప్రారంభ మయ్యే సమావేశంలో ప్రొ. జి.హరగోపాల్ స్వాగతోపన్యాసం, కల్లూరి భాస్కరం కీలక ప్రసంగం చేస్తారు. తర్వాతి సమావేశంలో సి.కాశీం వక్తగా పాల్గొననున్నారు. భోజన విరామం అనంతరం జరిగే సమావేశాలలో ఉదయమిత్ర, గూడూరు మనోజ వక్తలుగా ప్రసంగిస్తారు. మూడవ సమావేశానికి సుంకిరెడ్డి నారాయణరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కాగా, ముగింపు సందర్బంగా కాత్యాయిని విద్మహే నివేదికను సమర్పిస్తారు. ‘ఆహ్వాన సంఘం’ అధ్యక్షులుగా జి.హరగోపాల్ ఉన్నారు.