13-12-2024 12:00:00 AM
లోక్‌సభతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే దిశగా మరో ముందడుగు పడింది. దీనికి సంబంధించి జమిలి ఎన్నికల బిల్లుకు గరువారం కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ సమగ్ర బిల్లు చర్చకు రావచ్చని తెలుస్తోంది. దేశంలో లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందని, వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోతోందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొలినుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను జమిలిగానే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం అధికార ఎన్డీఏ కూటమికి లేదు. అయినా ఈ బిల్లును ఆమోదించుకోవడానికి ముందడుగు వేయాలని మోదీ భావించడం గమనార్హం.
మొదట పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఈ దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉండడంతో బిల్లును సంయుక్త పార్లమెంటురీ కమిటీ(జేపీసీ)కి సిఫార్సు చేసే అవకాశం ఉంది. తద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోను, వివిధ రాజకీయ పార్టీలతోను విస్తృత చర్చకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. జమిలి ఎన్నికల ఆలోచన కొత్తదేమీ కాదు. గతంలోనే మోదీ ప్రభుత్వం దీనిపై సిఫార్సులు చేయడానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2023 సెప్టెంబర్ 2న నివేదిక రూపకల్పనకు కమిటీ శ్రీకారం చుట్టింది.
191రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తి చేసి,18 వేలకు పైగా పేజీలున్న నివేదికను కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫార్సు చేసింది. ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సాయపడుతుందని కోవింద్ కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది.
తొలిసారిగా అన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. అలాగే హంగ్‌హౌస్, లేదా అవిశ్వాస తీర్మానం ద్వారా ఏదయినా ప్రభుత్వం పడిపోతే మిగిలిన అయిదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పలు సిఫార్సులు చేసింది, కాగా బీజేపీ సహా దేశంలోని దాదాపు 30 పార్టీలు ‘జమిలి’ ప్రతిపాదనను సమర్థించగా, కాంగ్రెస్ సహా 13 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
గతంలో స్వతంత్ర భారతంలో 1951నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల డం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నిటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని అసెంబ్లీల గడువును పెంచడమో, మరి కొన్నింటిని తగ్గించడమో చేయాలి. అయితే ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయి. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు గా పలు రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాలి. అందుకు ఉభయ సభల్లోను మూడింట రెండువంతు మెజారిటీ అవసరం.
అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఉభయ సభల్లో సాధారణ మెజారిటీ మాత్రమే ఉంది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల్లో సగానికి పైగా అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీల వరకు ఇబ్బంది లేదు కానీ పార్లమెంటులో మూడింట రెండువంతుల సభ్యుల మద్దతు కూడగట్టాలంటే బీజేపీ చాలా కసరత్తే చేయాల్సి ఉంటుంది. ‘మోదీ మ్యాజిక్’ ఏమేరకు పని చేస్తుందో చూడాలి.