06-07-2025 01:15:26 AM
-తెలంగాణ భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం
-పిల్లల భద్రత కేవలం చట్టపరమైన చర్యే కాదు అదొక నైతిక, జాతీయ బాధ్యత
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
-పిల్లలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
-లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ‘బాలల లైంగిక వేధింపులు, రక్షణ’ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): చిన్నారులకు వైద్య, న్యాయ, మానసిక సహాయాన్ని ఒకేచోట అందించే తెలంగాణ భరోసా కేంద్రాల పనితీరు దేశానికే ఆదర్శమని సుప్రీంకోర్డు న్యాయమూర్తి, నల్సార్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. చిన్నారులపై లైంగిక దాడుల నివారణ, బాధితుల హక్కులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం, యూనిసెఫ్, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా ‘బాలల లైంగిక వేధింపులు, రక్షణ’ పేరుతో సదస్సు శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వహించారు.
ఈ సంద ర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. పిల్లల భద్రత కేవలం చట్టపరమైన చర్య మాత్రమే కాదని, అదొక నైతిక, జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు. పిల్లల విషయంలో వ్యవస్థలో జరిగే ప్రతి నిర్లక్ష్యం, ప్రతి వైఫల్యం కేవలం నేరపూరిత తప్పిద మే కాక బాల్యానికి చేసే తీవ్రమైన ద్రోహమన్నారు. చట్టాలు పటిష్ఠంగా అమలు జరిగినప్పడే చిన్నారులకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైంగిక నేరాల ను నియంత్రించడమే కాకుండా బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకురావడంతోపాటు దానికి అను సంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయ ని వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పోలీ సు సహాయమే కాకుండా న్యాయ పరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్ వం టి సేవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
హై దరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలి చిందన్నారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్ష ణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవటమే ఈ కేంద్రాల లక్ష్యమని తెలిపారు. పోక్సో చట్టం, జువైనల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నప్పటికీ ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూ ర్ణ సహాయకారిగా ఉండాలని ఆకాంక్షించా రు. సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఇందుకు అవసరమైన చర్యలు తీసు కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. న్యాయం కేవలం కోర్టుల్లో నే కాకుండా ప్రతి దశలోనూ రక్షణ ఉండాలని, పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రా లతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యా యం, రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. ఇ లాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వామ్య సభ్యు లందరికీ విజ్ఞప్తి చేశారు. న్యాయమంటే కేవ లం శిక్షలు విధించడం వరకే కాదని, బాధితు ల జీవితానికి భరోసా కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్య లు తీసుకొని వారి బాల్యాన్ని తిరిగి పొం దేలా చర్యలు ఉండాలని వెల్లడించారు.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో పోక్సో కేసులు పెరగడం ఆందోళనకర విషయమని తెలిపారు. నమోదవుతున్న కేసుల్లో 98 శాతం కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారే నిందితులుగా ఉండటం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక నేరాల పట్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ, ప్రతిఒక్కరూ సున్నితత్వంతో వ్యవహరించాలని సూచించారు. డీజీపీ జితేందర్ మాట్లాడు తూ.. పిల్లల భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వ చర్యలకు భరోసా కేంద్రాలే ని దర్శమని తెలిపారు.