12-12-2024 12:00:00 AM
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మొదటి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు రైతు రుణమాఫీ విషయంలో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో చర్చకు సిద్ధమా అనే సవాల్ విసరటం జరిగింది.
కానీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్ నుండి కానీ బీజేపీనుండి కానీ సరైన ప్రతిస్పందన రాలేదనే చెప్పాలి. మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతు పండుగ వేదిక నుండి, పెద్దపల్లిలో నిర్వహించిన యువవికాసం వేదిక నుండి ప్రతిపక్షాలకు రైతు రుణ మాఫీపై, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలన్న సవాల్‌పై ప్రతిపక్షాలు అటు శాసనసభలోనూ, ఇటు క్షేత్రస్థాయిలోనూ చర్చకు సిద్ధపడితే బాగుంటుంది. రైతు రుణమాఫీలో ఎదురైన సమస్యలపైన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో, పరీక్షల నిర్వహణలో ఎదురైన అభ్యంతరాల పైన చర్చ జరిగినప్పుడే రైతులకి నిరుద్యోగులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
రైతు రుణమాఫీ సంపూర్ణమేనా!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తామనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రాథమిక అంచనా ప్రకారంగా 40 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనాయి. రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనల మేరకు 27 రోజులలోనే ప్రభుత్వం 22 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా 18 వేల కోట్ల రూపాయల రైతు పంట రుణాలను మాఫీ చేసింది. నాలుగో విడతలో మరొక మూడు లక్షల మంది రైతులకు 2724 కోట్ల రూపాయల రుణాలను కూడా మాఫీ చేసింది. అంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. ఇంకా వివిధ రకాల కారణాల వల్ల 15 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూడటం వలన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ ప్రక్రియ విమర్శలకు గురైనది.
సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే అర్హత గల ప్రతి రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. ఒక రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో ఒకే దఫాలో రుణమాఫీ జరిగిన చరిత్ర లేదు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణాలను నాలుగు విడతలలో మాఫీ చేయడానికి మల్లగుల్లాలు పడింది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా మూడు విడతలలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రైతుకు కేవలం 6వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని మాత్రమే అందించటం, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రైతు రుణమాఫీ జరగకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీపై విపక్షాలు పూర్తిస్థాయిలో విమర్శలు చేయటానికి వెనకాడుతున్నట్లుగా కనిపిస్తోంది.
రైతు రుణమాఫీ విషయంలో విపక్షాల బలహీనతను ఎత్తిచూపుతూ సంపూర్ణ రుణమాఫీ చేస్తాననే హామీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసురుతున్నట్లుగా కనిపిస్తోంది.సాంకేతిక కారణాలతో రుణమాఫీ పొందలేని రైతుల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వారి రుణాలను కూడా మాఫీ చేస్తే ప్రభుత్వం తన హామీని సంపూర్ణంగా నెరవేర్చినట్లు అవుతుంది. ప్రభుత్వం 2024 -25 రాష్ట్ర బడ్జెట్ లో రైతు రుణమాఫీ కోసం 26 వేల కోట్ల రూపాయలను కేటాయించింది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేసింది.
ఉద్యోగాల భర్తీలో మంచి మార్కులే
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో నిధులు, నీళ్లు, నియామకాలు ప్రధాన నినాదం. కానీ గత ప్రభుత్వ దశాబ్ద పాలనలో ఉద్యమ ప్రధాన నినాదాలలో ఒక టైన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో, నియామకాలలో జాప్యం, నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు గురవటమే కాదు గత ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడానికి నిరుద్యోగులలో ఏర్పడిన అసంతృప్తి కూడా ఒక కారణం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో, పోటీ పరీక్షల నిర్వహణలో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందనే భావన వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కొనసాగిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇస్తూ ఈ సంవత్సర కాలంలోనే 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ప్రభుత్వం చెప్తోంది.
ఈ స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిందా? నియామకాల విషయంపై ప్రతిపక్షాలు చర్చకు సిద్ధమేనా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే హామీని నిలబెట్టుకోలేకపోవటం, కేంద్ర సర్వీసులలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వేగంగా ఉద్యోగాలను భర్తీ చేయకపోవటం వలన ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ విషయంలోనూ రేవంత్ రెడ్డి సవాల్‌కు సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు అక్కడ ప్రభుత్వం కూడా గ్రూప్1 నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ఉద్యోగాల భర్తీ ముందుకు సాగటం లేదు.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 65 రోజులలోనే డీఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టటం, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని గ్రూప్1మెయిన్స్ పరీక్షను పూర్తిచేసి శరవేగంగా నియామకాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ ఇమేజ్ పెరిగింది. కాబట్టి ఉద్యోగాల భర్తీ విషయంలో ధైర్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతుంటే విపక్షాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాల విషయంలో పెద్దగా విమర్శలు ఎక్కు పెట్టలేకపోతున్నా యి. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా రాబో యే రోజులలో మరొక లక్ష ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయగలిగితే ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ విషయంలో మంచి పేరు వస్తుంది.
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో పాలక, ప్రతిపక్షాల మధ్య సవాళు,్ల ప్రతి సవాళ్లు ఎలా ఉన్నా అంతిమంగా ప్రభుత్వ నిర్ణయాల వలన అటు రైతాంగానికి ఇటు నిరుద్యోగులకు లబ్ధి చేకూరిందా లేదా అనేదే ప్రధాన అంశం. ఇంకా 15 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనే విమర్శలు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొత్త ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను జాప్యం లేకుండా చేపట్టాల్సిన బాధ్యత కూడా దానిపై ఉన్నది.
ఆరోపణలు, విమర్శలు, సవాళ్ల కంటే ఇలాంటి ప్రజోపయోగ విషయాలపై శాసనసభ లాంటి అత్యున్నత చట్టసభలలో అర్థవంతమైన చర్చలు జరిగితే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి శీతాకాల శాసనసభ సమావేశాలలో పాలక, ప్రతిపక్షాలు రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా ప్రజా సమస్యలపై ప్రజల అవసరాలపై చర్చించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877