calender_icon.png 6 July, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద సీట్లు బీజే పీకే!

06-07-2025 01:18:52 AM

రానున్నది కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ

అధికారం, అవినీతి కాంగ్రెస్ నైజం

ఏఐసీసీ అంటే ‘ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ’

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం

బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే యూరియా లేదంటూ నాటకం

అదనంగా ఇచ్చిన 2 లక్షల టన్నుల యూరియా తిన్నారా?

సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగంలో చేర్చిందే కాంగ్రెస్

మతం ఆధారంగా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు  అంటున్నారని, కానీ 100 సీట్లు వచ్చేది భారతీయ జనతా పార్టీకేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. రానున్నది కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అని, అధికారం, అవినీతి ఆ పార్టీ నైజం అని విమర్శించారు.

ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగంలో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ఎమర్జెన్సీ పేరుతో దేశ ప్రజలను ఆ పార్టీ వేధించిందని ఆరోపించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించాక పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడి హోదాలో తొలి మీడి యా సమావేశంలో  రాంచందర్‌రావు మాట్లాడారు.. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఓ సాధారణ కార్యకర్తకు దక్కి న గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

సైకిల్‌పై తిరిగి పార్టీ వాల్‌పోస్టర్లు అతికించానని గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషికి దక్కిన గౌరవం ఇదన్నారు. 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. పార్టీ ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీలో తెలంగాణ బాధ్యతలు తనకు లభించడం గర్వంగా ఉందన్నారు. 

బీజేపీకే పట్టం..

రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు, అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రాంచందర్‌రావు చెప్పారు. 

 బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలను మోసం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వం బికారీగా మారిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా తన నిస్సహాయతను ఒప్పుకున్నారన్నారు. అడుక్కునే పరిస్థితి వచ్చిందని సిగ్గులే కుండా ఏడుస్తున్నాడని అన్నారు. ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తే వాళ్ల ఉసురు తగులుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక లున్నందుకే రైతుభరోసా ఖాతాల్లో పడిందన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగు తున్న సమయంలో యూరియా లేదంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. యూరియా కొరత పై బీజేపీ చర్చకు సిద్ధమని..ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి 12.90 లక్షల టన్నుల యూరియా ఇచ్చామని తెలిపారు. అదనం గా ఇచ్చిన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తిన్నారా అని ప్రశ్నించారు. 

ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ..

బీజేపీ మీద ఆరోపణలు చేసే ముందు వారు పునరాలోచన చేసుకోవాలంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు హితవు పలికారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని ఖర్గే, రేవంత్, కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాల్సిన విషయమన్నారు. ఎల్బీ స్టేడియం సభలో మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కానీ బడుగు, బలహీనవర్గాలకు ఏం చేస్తారో చెప్పలేదని దుయ్యబట్టారు.

తక్కువ కాలం లో అవినీతి ప్రభుత్వంగా రేవంత్ సర్కారు పేరుతెచ్చుకుందన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 2 సీట్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని..వారిని జనం నమ్మరని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పార ని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ర్టంగా చేసిన ఘనత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలదేనని విమర్శించారు. 

ఎమర్జెన్సీలో సెక్యులర్, సోషలిస్ట్ చేర్చారు..

ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగంలో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ అని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ పెట్టి దేశ ప్రజలను వేధించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మన సైన్యం మీద అవమానకరమైన మాటలు మాట్లాడే వారికి తాము సమధానమివ్వబోమని తెలిపారు.

సైన్యానికి ఖర్గే, రాహుల్ సారీ చెప్పాలన్నారు. ‘బీసీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని మంత్రి పొన్నం అంటున్నారు.. నేను బీజేపీ అధ్యక్ష పదవికి రిజైన్ చేస్తా.. సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తా రా..’ అని సవాల్ విసిరారు. రాజాసింగ్ వ్య వహారం అధిష్ఠానం చూసుకుంటుందన్నా రు. బీసీ బిల్లు పాస్ చేసి కేంద్రంపై నెపం పెడితే ఎలా అని.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవని.. ఇతర వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే న్యాయపరంగా సవాళ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెపుతున్నారని, అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.12 లక్షల కోట్ల నిధు లు ఇచ్చామని వెల్లడించారు. ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు ఎన్వీ సుభాశ్, గుజ్జుల, కాసం, రాణీరుద్రమ, సంగప్ప పాల్గొన్నారు.