తొలి లిఖిత తెలుగు కవిగుణాఢ్యుడు

29-04-2024 12:10:00 AM

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

‘సాహిత్యపు ప్రాథమిక దశ మౌఖిక సాహిత్యం. తదనంతర దశ లిఖిత సాహిత్యం’ సాహితీ చరిత్రను ఈ క్రమంలో సాహిత్య విమర్శకులు పరిశోధించాలని భావిస్తుంటారు. మానవుని తొలి హృదయఘోష తొలు త మౌఖిక రూపంలోనే వ్యక్తమౌతుందన్నది అందరి అభిప్రాయం. లిపి ఏర్పడ్డ తరువాతే లిఖిత సాహిత్య సృజన ప్రారంభమవుతుందన్న విషయంలో అందరిదీ ఏకాభిప్రాయమే. ఆ పరిశోధకుల శోధనలో ‘తొలి తెలుగు లిఖిత కవి’గా గుణాఢ్యుడు గుర్తింపబడ్డాడు. సాహిత్య చరిత్రకారులు తెలుగు నేల పాలకులను గురించి, వారి సాహిత్య పోషణ వివరాలను గురించి పలు ప్రామాణిక ఆధారాలతో అనేక కొత్త అంశాలను బహిర్గత పరిచారు.

శాతవాహన రాజులు తెలంగాణ తొలి తెలుగు పాలకులనీ, ప్రాకృతభాష రాజభాషగా ఆనాడు ఒక వెలుగు వెలిగిందని చారిత్రక పరిశోధకులు భావించారు. ఆ మార్గంలో తమ పరిశోధనలు సాగించినప్పుడు తొలి లిఖిత కవి గుణాఢ్యుడేనన్న విషయాన్ని వారు నిర్ధారించారు. ఆయన పైశాచీ భాషలో ‘బృహత్కథ’ అనే ఒక మహాకథా కావ్యరచన చేసినట్లుగానూ గుర్తించారు. గుణాఢ్యుడు మెదక్ జిల్లాలోని కొండాపుర ప్రాంత వాసి. ఆయన క్రీ. పూ. 200 సం॥రాల మధ్య కాలానికి చెందినవాడు. నాగ ప్రభువు అనే వ్యక్తికి, ఓ బ్రాహ్మణ కన్యకు జన్మించిన వాడనీ పరిశోధకులు చెప్తారు. అప్పటి పాలకుడైన 13వ శాతవాహన రాజు కుంతల శాతకర్ణి ఆయనను ఆస్థానకవిగా గౌరవించినట్లు తెలుస్తున్నది. 

ఈ శాతవాహనుల రాజ్యం శ్రీముఖ శాతవాహనునితో ప్రారంభమై, 3వ పులమావితో ముగిసినట్లు చరిత్ర చెబుతున్నది. తెలంగాణ శైవక్షేత్రాలలో ఒకటైన కోటిలింగాల నాటి పాలకులకు రాజధానిగా ఉండేది.  గుణాఢ్యుడిని ఆస్థానకవిగా గౌరవించిన శాతవాహన రాజు అయిన కుంతల శాతకర్ణి సంస్కృత భాషకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. గుణాఢ్యుడుని బృహత్కథ ప్రాకృతంలోనో, సంస్కృతంలోనో కాకుండా పైశాచీభాషలో రచింపబడటానికి ప్రధాన కారణాన్ని వ్యక్తపరిచే కథ ఒకటి ప్రచారంలో ఉంది. 

అడవుల బాట పట్టిన ఆస్థాన కవి

ఆనాటి రాజు తమ దేవేరులతో జలక్రీడ ఆడుతున్న సందర్భం అది. ఆయన తన పట్టమహిషిపై నీళ్ళను చిమ్ముతుంటాడు. అప్పుడు ఆమె, “మోదకై స్తాడయ’----’ అన్నదట. అంటే ‘మా+ఉదకైః+తాడయ’. దీనిలోని భావనను రాజు సరిగ్గా గుర్తించలేక పోయాడు. భావం అర్థం కాని రాజు, మోదకములను తెప్పించి ఆమెను కొట్టాలనుకొన్నాడు. ఆ ప్రయత్నాన్ని చూసిన రాణి నవ్విందట. తనకు సంస్కృత భాషా పరిజ్ఞానం లేని కారణంగానే ఇది జరిగిందని భావించాడు రాజు. దాంతో, “తనకు ఆరు నెలల్లో సంస్కృతాన్ని నేర్పగలిగిన వారెవరైనా ఉన్నారా?” అని కొలువులోని భాషా పండితు లను ప్రశ్నించాడు. ఆస్థాన కవి అయిన గుణాఢ్యుడు, “ఆరు నెలలలో సంస్కృత భాష నేర్పడం సాధ్యం కాదు మహారాజా!” అన్నాడు.  అప్పుడు అక్కడే ఉన్న శర్వవర్మ అనే పండితుడు, “రాజా! మీరు అనుమతిస్తే నేను ఆ పని చేయగలను” అన్నాడు. అందుకు గుణాఢ్యుడు భావోద్వేగంతో, “నువ్వు ఆ పని చేయగలిగితే నేను ఈ భాషనే వదిలి వేస్తాను. అంతేకాదు, ఈ రాజాస్థానం వదిలి అడవులకు వెళ్లిపోతాను” అని ప్రతిజ్ఙ చేశాడు. 

మహా కథా కావ్యం

శర్వవర్మ రాజుకు సంస్కృతం నేర్పడం కోసమే అన్నట్టుగా ‘కాతంత్ర వ్యాకరణాన్ని’ రచించాడు. దానిద్వారా తాను అన్నట్లుగానే ఆరు నెలలలో రాజుకు సంస్కృత భాషను నేర్పాడు. మాటకు కట్టుబడిన గుణాఢ్యుడు తన ప్రతిజ్ఞ మేరకు రాజాస్థానాన్ని వీడి అరణ్యంలోకి వెళ్లిపోయాడు. గుణాఢ్యుడు అంతటితో ఊరుకోకుండా, అడవిలో వుండగానే సంస్కృత, ప్రాకృత భాషలను విసర్జించేశాడు. వాటికి బదులుగా ‘పైశాచిక భాష’ను చేప ట్టాడు. ఇందులోనే ఆయన మొత్తం ఏడు లక్షల శ్లోకాలతో ‘బృహత్కథ’ అనే ఒక మహాకావ్య రచన చేసినట్లు చరిత్ర చెబుతున్నది. తర్వాత తన శిష్యులైన గుణదేవ, నందిదేవులతో ఆ మహాగ్రంథాన్ని రాజు సన్నిధికి పంపాడు. 

రాజు ఆ గ్రంథరాజాన్ని స్వీకరించడానికి తిరస్కరించాడట! దీంతో ‘దాదాపు ఏడేళ్ల తన శ్రమను రాజు తిరస్కరించినట్లు’గా గుణాఢ్యుడు భావించాడు. రాజు ప్రదర్శించిన ఆ తిరస్కారాన్ని అవమానంగానూ భావించాడు. తర్వాత అడవిలోనే ఒక మహా హోమాన్ని జరిపాడు. ‘బృహత్కథ’లోని ఒక్కో పత్రాన్ని హోమాగ్నికి ఆహుతి చేయడం మొదలు పెట్టాడట. రాజుకు ఈ విషయం తెలిసి పశ్చాత్తాపానికి లోనయ్యాడు.

రక్తంతో రాసిన కవి

వెంటనే అడవికి వెళ్లి, గుణాఢ్యుని కలిశాడు. ‘తన తప్పును క్షమించమని’ వేడుకొన్నాడు. ‘హోమాన్ని తక్షణం ఆపవలసిందిగా’ వేడుకొన్నాడు. ‘మిగిలిన కావ్యాన్ని తాను స్వీకరిస్తా’నన్నాడు. అప్పటికే అధిక భాగం అగ్నికి ఆహుతి కాగా, మిగిలిన కథలే తదనంతర కాలంలో ఎంతో ప్రసిద్ధికెక్కాయి. ఈ ‘బృహత్కథ’ను గుణాఢ్యుడు తన రక్తంతో రాశాడని కూడా కొందరు చరిత్రకారులు పేర్కొంటారు. ఈ కావ్యాన్ని ‘దేశీ’భాషలోనే ఆయన రచించినట్లు తెలుస్తున్నది. రాజులు ‘దేశి’ని అనాదరణకు గురి చేశారని, అందుకు నిరసనగా దీనిని అదే భాషలో రచించి వుంటాడని వారంటారు. ఈ దేశీ భాషనే ‘పైశాచీ భాష’ అని అన్నారని కూడా కొన్ని అభిప్రాయాలు వున్నాయి. రాజులు ఆదరించనిది గనుక ఇదీ పైశాచి అయి ఉండవచ్చు. కొందరు పరిశోధకులు ఇది ప్రాకృత భాషలో భాగమనే అంటారు.

సంస్కృతంలోకి ‘బృహత్కథ’

సంస్కృతం, తెలుగు వంటి వివిధభాషల్లో కథాకావ్యాల విస్తృతికి బీజం పడింది కూడా ఈ బృహత్కథ వల్లనే అన్నది పాహిత్యవేత్తలందరి ఏకాభిప్రాయం. తదనంతర కాలంలో సంస్కృత కవులు ఈ ‘బృహత్కథ’ను సంసృ్కత భాషలోకి తెచ్చారు. సోమదేవిసూరి అనే పేరుగల సంస్కృత కవి ‘కథా సరిత్సాగరము’ అనే పేరుతో ‘బృహత్కథ’ను సంసృ్కత భాషలో రచించాడు. ఆ గ్రంథ పీఠికలో ఇంతకు పూర్వమే చెప్పిన కథ ప్రసక్తి ఉంది. నాటి శాతవాహన రాజు సభలోనే ఇది జరిగినట్లు అందులో వివరించాడు. 

సుప్రసిద్ధ సంస్కృత అలంకార శాస్త్రకారుడైన క్షేమేంద్రుడు కూడా ‘బృహత్కథా మంజరి’ పేరుతో ‘బృహ త్కథ’ను సంస్కృతంలో రచించాడు. ‘ఔచిత్య విచార చర్చ’ వంటి గొప్ప లక్షణ గ్రంథ రచయిత తనదైన శైలిలో రాశాడు. ఒక మహా రచన వెలుగుచూసిన ఈ తెలుగునేలను పుణ్యభూమిగా భావించాలి. తొలి లిఖిత తెలుగు కవి జన్మించిన, సర్వకథా సాహిత్యానికి మాతృక ఆవిర్భవించిన భూమి అయిన మన తెలంగాణ నిజంగా అక్షర మాగాణమే!

- (వ్యాసకర్త సెల్: 9949013448)