నేర్చుకోవాలి!

29-04-2024 12:05:00 AM

షేరింగ్ ఆటో గుండా ప్రయాణిస్తాం.  

మరో రోజులోకి. 

మళ్ళీ ఆ బ్రతుకు అరణ్యంలోకి. 

మనం అటెండ్ చెయ్యక తప్పని

మనుషులలోకి. 


డెక్‌లో పాట. 

అమ్మా తెలంగాణమా, ఆకలికేకల గానమా..., 

నిరంతరాయంగా. 

ఏండ్లుగా డొక్కలో సుళ్ళు తిరుగుతూ. 

ఎక్కడెక్కడి యాదిల్లోకి లాగుతూ.


అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా. 

పవుతు నా తిండి, నా తాగుడు, 

ఎన్నడన్న పక్కోనికి పైస పెట్టినాడె?! 

ఎవని పాపాన వాడే పోతడక్కా. 

దావ్‌ఖానల పడ్డప్పుడు 

మనమైతె మందులిచ్చి రావాలె గద? 


ప్రేమైకమూర్తులు. 

సాయిబాబా గుడి దగ్గరి గుంతల్లో 

ఆటో కిందా మీదా అయినప్పుడు, 

రోడ్డు సల్లగుండ అంటూ, 

కోపంలోనూ నోరు జారని వాళ్ళు. 

పాఠాలు తెలియని వాళ్ళు. 

పాటలను మించిన వాళ్ళు.


ఏమి కావలె, 

ఇక ఈ సమయానికి, జీవితానికి? 

పై గుండీ విప్పి, 

అంగీ వెనక్కి లాగితే, 

తగిలే చల్లని గాలి చాలు.

  (జీరో డిగ్రీ కవితా సంకలనం నుండి)