calender_icon.png 13 February, 2026 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి

13-02-2026 12:00:00 AM

తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) జిల్లా కార్యదర్శి డి పున్నంచంద్ 

పాల్వంచ, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి):  అమెరికాతో, భారత ప్రభుత్వం ఏకపక్షంగా కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, తెలంగాణ రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి డి పున్నం చంద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు, దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా, (మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల) గురువారం పాల్వంచ పట్టణంలోని తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సూరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా పున్నం చంద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం అమలయితే అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి దిగుమతి సుంకాలు  లేకుండా పెద్ద ఎత్తున మనదేశంలోకి దిగుమతి అవుతాయని, అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుందని, మనదేశంలో వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం మూడు శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తుందని అన్నారు.

మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువని, చౌకగా ఉత్పత్తి అయిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మనదేశంలోకి విచ్చలవిడిగా వస్తాయని. మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాలా తీస్తారన్నారు. అందువల్ల 65 శాతం జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం దెబ్బతింటుందని,

మన దేశంలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన 18% పన్నులు అమెరికా విధించిం దని, మన ఎగుమతులు క్షీనిస్తాయని, మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాలా తీస్తారని పేర్కొన్నారు. 2026 - 27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎరువులపై సబ్సిడీ తగ్గించిందని, దాంతో ఎరువులు పురుగుమందుల ధరలు పెరిగి రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఉందన్నారు. 

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దుచేసి పేదలకు ఉపాధి లేకుండా చేసే విబి- జీరాంజి 2025 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, కేంద్ర ప్రభుత్వం తన వాటా 90% నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపిందని, యధావిధిగా 2005 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని,

200 రోజులకు పని దినాలు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు సూరేపల్లి వెంకటేశ్వర్లు, శర్ప నారాయణ, ఊకం పాపారావు, బట్ట సూరమ్మ, గజ్జి కోటమ్మ, మడివి దేవయ్య, తోలెం మమత, రాజేశ్వరి, వినోద్, నరేష్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.