స్వరాష్ట్రంలోని సంక్షేమ ఫలాలు
- నిర్మల్ జిల్లా గణనీయమైన అభివృద్ధి
- ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ చీఫ్ వీప్ వేముల వీరేశం
నిర్మల్ జూన్ 2 (విజయ క్రాంతి): కలెక్టరేట్లో మంగళవారం ఉదయం 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలలో భాగంగా, ప్రభుత్వ విప్ జిల్లా ప్రగతికి సంబంధించిన సందేశాన్ని శాఖల వారీగా చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నిర్మల్ జిల్లా అద్భుత ప్రగతి సాధిస్తుందని వివరించారు. పేదలకు ఎన్నో రకాల పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.
మహిళా సంఘాలకు మంజూరైన 74 కోట్ల 93 లక్షల రూపాయల చెక్కును, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కమిషన్ కు సంబంధించి 3 కోట్ల 94 లక్షల 91 వేల 512 రూపాయల చెక్కును అందించారు.వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఈ వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.వేడుకల అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రావతరణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీలు సాయికిరణ్, ఉపేంద్ర రెడ్డి, డిఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






