ప్రారంభమైన జీ 7 సమ్మిట్
- ఇటలీలో 15వ తేదీ వరకు నిర్వహణ
- ఉక్రెయిన్, గాజా సంక్షోభంపైనే చర్చ
- గురువారమే వెళ్లిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 13: ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల కూటమి జీ-7 సమ్మి ట్ ఇటలీలోని అపులియా ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో గురువారం ప్రారంభమైం ది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 15 తేదీ వరకు జరుగనున్న ఈ సమావేశంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాధినేతలతోపాటు మరికొన్ని ఆహ్వానిత దేశాల అధినేతలు కూడా పాల్గొంటున్నారు. భారత్‌ను కూడా ఈ సమ్మిట్‌కు పరిశీలక దేశంగా ఆహ్వానించారు. మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన.
యుద్ధ భయాలే ఎజెండా
ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు, గాజాపై ఇజ్రాయె ల్ ఆక్రమణ అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రధాని తనవెంట పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులను తీసుకె ళ్లారు. వీరిలో రక్షణ రంగానికి సంబంధించినవారే అధికంగా ఉన్నారు. ‘రక్షణ, భద్రతే ఈ సమావేశంలో మనకు ప్రధాన భూమిక. కీలకమైన సాంకేతికతల విషయంలో సహకారం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇటలీ రక్షణరంగ కంపెనీల మధ్య సహకారం, తీర రక్షణ అంశంలో సహకారంపై చర్చలు జరుపుతున్నాం’ అని ఇటలీలో భారత రాయబారి వాణిరావ్ తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అంశం తప్పకుండా కీలక చర్చనీయాంశంగా ఉంటుందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌క్వాత్రా తెలిపారు. ఈ సమ్మిట్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తోపాటు పలువురు దేశాధినేతలతో భారత ప్రధాని ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉన్నదని విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.






