అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల, మే 22(విజయక్రాంతి): అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక* 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరిసిల్ల లో జిల్లాస్థాయి సభ జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితె తదితరులు హాజరయ్యారు.ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, ఎంపీడీఓ లకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేశారు. చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, మహిళా సంఘాలు, మత్స్య శాఖ తదితర శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
వాటి సమాచారాన్ని సభకు వచ్చిన ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం, చైతన్యపర్చడం, భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నదని తెలిపారు.త్వరలో అమలు చేయనున్న ఇందిరమ్మ భీమా పథకం దేశంలో,ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు






