రాజన్న భక్తులకు మెరుగైన లడ్డూ సేవలే లక్ష్యం..
- ఈవో రమాదేవి
- లడ్డూ సత్రంలో ఆకస్మిక తనిఖీ
వేములవాడ, ఆగస్టు 16, (విజయ క్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని లడ్డూ సత్రాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్ రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన లడ్డూ ప్రసాదాన్ని అందించడమే లక్ష్యంగా లడ్డూ తయారీ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.లడ్డూ కొట్టే విభాగం, లడ్డూ ప్యాకింగ్ చేసే ప్రదేశం, పిండి రుబ్బే విభాగాలను ఈవో పరిశీలించారు. ఆయా విభాగాల్లో పరిశుభ్రత, లడ్డూ తయారీలో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, సిబ్బంది పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ తయారీలో పనిచేస్తున్న సిబ్బందితో ఈవో మాట్లాడారు. భక్తులకు మరింత నాణ్యమైన లడ్డూలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. తయారీ ప్రక్రియలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లడ్డూ తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి దశలో నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు.ఈ తనిఖీలో డీఈఓ నవీన్, ఏఈఓ మహేష్, పర్యవేక్షకులు రాజేందర్, సీనియర్ అసిస్టెంట్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






