calender_icon.png 15 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన సేవలతో ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యం

15-11-2025 12:41:35 AM

పకడ్బందీ సేవలతో నేరాల నివారణ:  ఎస్పీ నరసింహ 

నేరేడుచర్ల, నవంబర్ 14 :  పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పి కే. నరసింహ అన్నారు. ఆయన శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలలో భాగంగా తనిఖీ చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ పకడ్బందీ సేవలతో నేరాలను అదుపు చేయడంతో గతంలో కన్నా నేరాల సంఖ్య తగ్గిందన్నారు.

సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వినియోగం, దొంగతనాలు దోపిడీలను కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నివారించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అశాంతి, అభద్రత భావం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సేఫ్ హుజూర్ నగర్ సర్కిల్ ప్రాజెక్టులో భాగంగా సర్కిల్ పరిధిలో 150 నుండి 200 సీసీ కెమెరాలను, నేరేడుచర్ల లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలతో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా నేరాలను నిరోధించవచ్చని, సులువుగా గుర్తించవచ్చని అన్నారు. సీసీ కెమెరాలు కంట్రోల్ సెంటర్ జిల్లా కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తాయి అని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించి సొంతంగా కూడా ఏర్పాటు చేసుకొని రక్షణకు తోడ్పడునందించాలని పిలుపునిచ్చారు.

తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణము, రికార్డులను, పరిపాలన విధానాన్ని, సిబ్బంది సేవలను, సమయం పాలన, వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కారం, తదితర వాటిని తనిఖీ చేసి సంతృప్తి చెందారు. ఎస్త్స్ర రవీందర్ ను అభినందించిన ఎస్పి...

ఇటీవల ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి చనిపోయిన బాలిక మృతి దేహాన్ని  వెలికితీయడంలో వృత్తి పట్ల నిబద్ధత పాటించి కృషిచేసిన నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ ను అభినందించి శాలువాతో సన్మానించారు. ఎస్పి వెంట కోదాడ డీఎస్పి శ్రీధర్ రెడ్డి, డిసిఅర్ బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ రామారావు, హుజూర్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.