పాదర్శక సేవలను అందించడమే లక్ష్యం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బంజారాహిల్స్, మే 30(విజయక్రాంతి): ప్రజలకు పారదర్శకమైన ప్రభుత్వ సేవలను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్,ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్,దానం నాగేందర్,అద్దంకి దయాకర్,ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బంజారాహిల్స్ లో సమీకృత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ భవన సముదాయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న ప్రాంగణంలో బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, గోల్కోండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతో పాటు డీఐజీ కార్యాలయాలు, చిట్స్ విభాగం కార్యాలయాలు ఒకే చోట అందుబాటులో వస్తాయన్నారు.
భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతిక సౌకర్యాలు, విశాలమైన మౌలిక వసతులతో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు విజయరెడ్డి, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






