20-12-2025 12:40:31 AM
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ క్రీడా హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, క్రీడలను రాష్ట్ర అభివృద్ధి విధానంలో కీలక భాగంగా ప్రభుత్వం చూస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర క్రీడల చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యా ర్థులకు మంత్రులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో యూబీఎస్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ద్వారా గ్రామస్థాయిలో ఇప్పటికే నాలుగు లక్షల మంది క్రీడాకారుల ప్రతిభను గుర్తించామని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య ను ఐదు లక్షలకు పెంచి గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదిక లకు పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే దిశగా పటిష్టమైన క్రీడా విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు.
ఒకప్పుడు పిల్ల లు ఆడుకుంటామంటే అడ్డుకున్న తల్లిదండ్రులు, నేడు స్వయంగా క్రీడలవైపు ప్రోత్స హించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు పాత వాటిని ఆధునీకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ క్రీడా ప్రతి భను ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.