08-12-2025 12:44:15 AM
ప్రతి అవకాశం వినియోగం
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ల క్ష్యంగా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తమకు అనుకూల మైన వారికి నిత్యం ఫోన్ చేయడంతోపాటు తెల్లవారింది మొదలు ఇండ్ల ముందు వాలిపోయి తమకు ఓటు వేసి గెలిపించాలంటే వే డుకుంటున్నారు.
కుల మతాలు పక్కనబెట్టి ‘వరుస’లు కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తూ, తమకు ఓటు వేసి గెలిపించాలంటూ బతిమిలాడుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీ ఏఐ ద్వారా రూపొందించిన ప్రకటన లను సెల్ఫోన్ ద్వారా వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో పాటు వ్యక్తిగతంగా పం పిస్తూ ఓటేయాలంటూ వేడుకుంటున్నారు. తమ గుణగణాలను ఏకరూవు పెడుతూ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు.
కరపత్రాలతో ప్రచారం
తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి చేపట్టే పనులతో కూడిన కరపత్రాలను ముద్రించి ఇంటింటికి పంచుతూ తమను గెలిపిస్తే ప్రకటించిన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ తాము చేయబోయే పనులను ఆ కరపత్రాలు ఏ కరువు పెడుతున్నారు. అందులో ప్రకటించినవే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాము అన్నింటికి ముందుండి పనిచేస్తామంటూ ఊదరగొడుతున్నారు.
కుల సంఘాలకు ఆఫర్లు?
గంపగుత్తగా కులాలకు చెందిన ఓట్లను వేయించుకోవడానికి అభ్యర్థులు కుల సంఘాలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గుండు గుత్తగా తమకు ఓట్లు వేసేటట్లయితే మీ సంఘానికి కావాల్సిన ‘రిక్వైర్మింట్’ ఏమిటో చెప్పండి.. అది నేను ఫుల్ ఫీల్ చేస్తా మొత్తంగా నాకే ఓట్లు వేసి గెలిపించాలంటూ ఆఫర్లు ఇస్తున్నారు.
బాండ్ పేపర్ లపై హామీ పత్రాలు
ఓటర్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి మరికొందరు కొత్త తరహా ప్రచారా నికి తెర లేపారు. తమను గెలిపిస్తే ముందు గా మీకు చెప్పిన పనులన్నీ చేస్తాం.. ఆరు నెలల్లో చెప్పిన పనులు చేయకపోతే పదవి నుంచి వైదొలుగుతాం.. ఇందుకోసం ఏకం గా బాండ్ పేపర్ రాసిస్తామంటూ ప్రకటిస్తున్నారు. తమను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పనులు చేస్తామంటూ బాండ్ పేపర్లో ముద్రించి ఇంటింటికి హామీ పత్రాలను పంపిణీ చేస్తున్నారు.
డీజే సౌండ్ లతో ఊదరగొడుతున్నారు
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అంటూ ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు డీజే సౌండ్ లతో మార్మోగిపోతున్నాయి. వార్డు సభ్యుడు మొదలుకొని సర్పంచ్ వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమకు మద్దతిస్తున్న పార్టీ పాటలను పెడుతూ డీజే సౌండ్ లతో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పల్లెలన్నీ డీజే పాటలతో దద్దరిల్లిపోతున్నాయి.