18 April, 2026 | 3:14 PM

రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ లక్ష్యం

10-06-2025 12:53 AM
  1. పీఎం కిసాన్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్

మహేశ్వరం, జూన్ 9: రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రధాని నరేంద్రమో దీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పేర్కొన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్‌లో భాగంగా సోమవారం ఆయన మహేశ్వరం మండలంలోని మన్సాన్‌పల్లి, రామచంద్రగూడ గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.

అనంతరం స్థానిక రైతులతో సంభాషించారు. ఈసందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అధికమొత్తంలో నిధులను ఖర్చు చేస్తుందని చెప్పారు. పీఎం కిసాన్ యోజన ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో రూ.రెండు వేల చొప్పున రైతుల నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు.

కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, పార్లమెంట్ కో- కన్వీనర్ అనంతయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు యాదీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న స్టాళ్లు

వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు మనం నిత్య జీవితంలో ఉపయోగించే మునగాకు, హెర్బల్ టూత్ పౌడర్, హనీ వ్యాక్స్, సబ్బులు, మామిడి తాండ్ర తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆయా ఉత్పత్తుల ఉపయోగాలను వివరించారు.