2 July, 2026 | 1:17 AM

దిగివచ్చిన బంగారం, వెండి ధరలు

24-05-2024 12:05 AM

ఒకే రోజులో రూ.1,090 తగ్గిన తులం పసిడి

హైదరాబాద్, మే 23: ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో భారత్‌లోనూ ఆ రెండు లోహాల ధరలు కొత్త రికార్డుస్థాయి నుంచి దిగివచ్చాయి. గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా  రూ.1,090 మేర తగ్గి రూ.73,420 వద్ద నిలిచింది. గత వారాంతంలో పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.1,000 దిగివచ్చి రూ.67,300 స్థాయికి చేరింది. గురువారం భారీగా తగ్గినప్పటికీ, బంగారం ధర మే 1 నాటి ధరతో పోలిస్తే రూ.2,000 వరకూ పెరిగే ఉన్నది. 

రూ.3,300 తగ్గిన వెండి

పసిడి బాటలోనే వెండి కూడా హైదరాబాద్ మార్కెట్లో తగ్గింది. కేజీ వెండి ధర ఒక్కసారిగా రూ.3,300 తగ్గి రూ.97,000 వద్ద నిలిచింది. రెండు రోజుల క్రితం ఈ వైట్ మెటల్ ధర రూ.1,01,000 వద్ద రికార్డుస్థాయిని నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 2.5 శాతం మేర క్షీణించి 30.80  డాలర్ల వద్దకు చేరింది. 

మరింత తగ్గవచ్చు

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లో  ఇతర కమోడిటీలతో పాటు బంగారం, వెండి ధరలు సైతం బాగా తగ్గినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. ఇటీవల 2,440 డాలర్ల స్థాయికి చేరిన ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి 2,342 డాలర్ల వద్దకు పతనమయ్యింది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర రూ.1280 మేర క్షీణించి రూ.71,780 స్థాయికి తగ్గింది. ఇదే ట్రెండ్ కొనసాగితే శుక్రవారం స్థానిక స్పాట్ మార్కెట్లో మరో రూ. 1,000 వరకూ తగ్గే అవకాశం ఉన్నదని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.