ఇండిగో లాభాలు రయ్
న్యూఢిల్లీ, మే 23: దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 106 శాతం వృద్ధిచెంది రూ. 1,895 కోట్లకు చేరింది. నిరుడు ఇదే త్రైమాసికంలో రూ. 919 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన క్యూ4లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆదాయం 26 శాతం వృద్ధితో రూ. 17,825 కోట్లకు పెరిగింది. ఇబిటా 49 శాతం వృద్ధితో రూ. 4,412 కోట్లకు పెరగ్గా, పన్నుకు ముందు లాభం 92 శాతం ఎగిసి రూ. 1,771 కోట్లకు చేరింది. తమ వ్యూహాలను పక్కగా అమలుచేయడం ఫలితాల్ని ఇచ్చిందని, ఏడాది ప్రారంభంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చెప్పారు. ముగిసిన త్రైమాసికంలో ప్రయాణీకుల టిక్కెట్ ఆదాయం 25 శాతం పెరిగి రూ. 15,601 కోట్లకు చేరగా, యాన్సిలరీ ఆదాయాలు 19 శాతం వృద్ధితో రూ. 1,719 కోట్లకు పెరిగినట్టు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. ఇతర ఆదాయం రూ.680 కోట్లుగా నమోదయ్యింది.
2.67 కోట్ల మంది ప్రయాణీకులు
క్యూ4లో కంపెనీ వ్యయాలు సైతం 22 శాతం పెరిగి రూ. 16,734 కోట్ల వద్ద నిలిచాయి. ఇందులో ఇంధన వ్యయాలు 6 శాతం పెరుగుదలతో రూ 5,979 కోట్లకు చేరాయి. ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో ఇండిగోలో 2.67 కోట్ల మంది ప్రయాణించారు. ఈ వృద్ధి 14 శాతంకాగా, లోడ్ ఫ్యాక్టర్ 86.3 శాతానికి మెరుగుపడింది. అలాగే ఇండిగో ఫ్లీట్‌లో నికరంగా 9 విమానాలు జతయ్యాయి. మార్చి 31నాటికి తమ వద్ద రూ. 34,737 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది.
బిజీ రూట్లలో బిజినెస్ క్లాస్
దేశంలో ట్రావెలింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తమ ఫ్లుట్సైలో బిజినెస్ క్లాస్ సీటింగ్‌ను ప్రవేశపెడతామని ఇండిగో ప్రకటించింది. దేశంలో బిజినెస్ ట్రావెల్‌ను తమ 18వ వార్షికోత్సవం సందర్భంగా 2024 ఆగస్టులో బిజీగా ఉండే రూట్లు, బిజినెస్ రూట్లలో వినూత్న అనుభవాన్ని ఇచ్చే బిజినెస్ ట్రావెల్‌ను ప్రారంభిస్తామని తెలిపింది.






