ప్రతి పేదవాడికి వైద్యం అందించడమే సర్కారు లక్ష్యం
చౌటుప్పల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, మార్చి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మేళాను చౌటుప్పల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందజేసే వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా గ్రామ స్థాయిలో ఇలాంటి ఆరోగ్య మేళాలు నిర్వహించడం ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ఆరోగ్య మేళాలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని చైర్ పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి,కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్, బుడ్డ సురేష్, నాయకులు కేతరాజు అచ్చయ్య, ఆలే చిరంజీవి,మండల స్థాయి అధికారులు, వైద్యులు, కార్యకర్తలు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




