ఉద్యోగ, ఉపాధ్యాయులకు మొండిచేయి చూపిన ప్రభుత్వం
మహబూబాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన పీ ఆర్ సీల విషయంలో ప్రభుత్వం మొండి చేయి చూపిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బలాస్టి రమేష్ మాట్లాడుతూ విద్యకు 15 శాతం నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 8.23 శాతం కేటాయించడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా పి ఆర్ సి ఫిట్మెంట్ ను ప్రకటిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటికీ పి ఆర్ సి అమలు చేయకపోవడంతో ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులు వారు దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ సమయంలో వారికి చెల్లించకుండా వారి మరణానికి ప్రభుత్వం కారణమవుతుందని, ఇప్పటికే 80 మందికి పైగా ఉద్యోగులు వారికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మరణించారని ఇప్పటికైనా ప్రభుత్వం ఏక మొత్తంలో వారికి వచ్చే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దుచేసి, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డిఏలు విడుదల చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్ట్ టీచర్ల విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్, గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు కూడా నగదురహిత వైద్య సదుపాయాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ శ్రీశైలం, ఉపేందర్, బిక్షపతి, రామలింగారెడ్డి, బాబురావు, విద్యాసాగర్, సురేందర్, నరసింహరాజు, యాదగిరి, బాలాజీ, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, శివ కుమార్, ఆదినారాయణ, శృతి, షేక్ రిజ్వానా, అనిత పాల్గొన్నారు.




