25 March, 2026 | 3:04 AM

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యులు కావాలి

25-03-2026 01:26 AM
  1. కలెక్టర్ గరిమ అగ్రవాల్

బోయినపల్లి మండలం కొదురుపాక పీహెచ్ సీలో ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం

పేషెంట్లకు పోషకాహార కిట్ల పంపిణీ

ఉత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత

బోయినపల్లి:, మార్చి 24(విజయక్రాంతి):టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కా ర్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్ సీ లో మంగళవారం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా 15 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులు పంపిణీ చేశారు. అలాగే టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించిన 20 గ్రామాల కార్యద ర్శులు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి, శాలువాతో సన్మానించారు.

వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొబైల్ ఎక్స్ రే యంత్రం ద్వారా జిల్లాలోని 42 గ్రామాల్లో మొత్తం 100 రోజుల్లో చేయనున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రోగ్రామ్ ను కలెక్టర్ ప్రారంభించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు.కలెక్టర్ మాట్లాడారు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వ తేదీ వరకు అన్ని శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సేవలు అందిస్తున్నామని వివరించారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు.

టీబీ ముక్త్ భారత్ అభియాన లో భాగంగా జిల్లాలో టీబీ నిర్ధారణ ఆరోగ్య పరీక్షలు మొబైల్ వాహనం, ఎక్స్ రే యంత్రం ద్వారా ప్రణాళిక ప్రకారం చేస్తారని, మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా, ఇతర ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించాలని సూచించారు. టీబీ బాధితులకు ప్రతి నెలా రూ. వెయ్యి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నదని వెల్లడించారు. పేషెంట్లు కచ్చితంగా మందులు వాడుతూ..పోషకాహారం తీసుకోవాలని సూచించారు. 

జిల్లా వ్యాప్తంగా 360 మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డీఎం హెచ్ ఓ నాగేంద్ర బాబు, వైద్యులు శంకర్, సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రేణు ప్రియాంక, రాజు కుమార్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ కే మంజుల, ఎంపీఓ శ్రీధర్, టీబీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.