గురుకులాలను నాశనం చేస్తున్న సర్కారు
౩౦సార్లు ఢిల్లీ వెళ్లి ఏం వెలగబెట్టారు?: మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో గురుకులాలను ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ అద్భుతంగా తీర్చిదిద్దితే.. రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
గురుకుల విద్యార్థులు ఎవరెస్టుతో పాటు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారని గుర్తు చేశారు. గురుకులాల్లో పరిస్థితుల అధ్యయనానికి వెళ్లిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ విద్యార్ధి విభాగం గురుకులాలను సందర్శిస్తే రేవంత్‌రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికే తమ బృందాలు గురుకులాల్లో పర్యటిస్తున్నాయని చెప్పారు. పదే పదే కేసీఆర్‌ను రమ్మని అడుగుతున్నారు.. ఆయ న వస్తే తట్టుకోలేరు.. సభ నుంచి పారిపోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. వడ్ల కొనుగోలుపై ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదని, రైతు భరోసా కన్నా బోనస్ బాగుందని చెప్పడానికి మంత్రికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు.
దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదని.. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఏడాదిలో సీఎం 30 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం వెలగబెట్టారో చెప్పాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్‌ఎస్ కుట్ర అంటూ.. నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.






