విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పనకు సర్కారు ప్రాధాన్యం
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్, ఏప్రిల్ 9(విజయ క్రాంతి): కాలేజీలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కూకట్పల్లి లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 8 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే జిల్లాలోని అంగన్వాడి సెంటర్ల టీచర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేశారు.
ఇందులో రూ.4.95 కోట్ల పీఎం ఉషా గ్రాంట్స్ నిధులతో కళాశాల జీ+1 భవనం ప్రారంభించగా, రూ. 2.84 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో జీ +2 లో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జీవీ(ZUVY) కింద నవ గురుకుల సంస్థ ద్వారా 86 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత లాప్ టాప్ పంపిణీ తో పాటు ఏడాది పాటు శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయని మహేందర్ రెడ్డి తెలిపారు. పాఠశాల తో పాటు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు కష్టపడి చదవాలని మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను దేశ వ్యాప్తం చేయాలని విద్యార్థులకు సూచించారు. కూకట్పల్లి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలకు స్థలం కోసం ముఖ్యమంత్రి కి నివేదిస్తా అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సహజసిద్ధమైన, సృజనాత్మకతతో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని తెలిపారు.
కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణ తో చదవాలని, విజయాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. ఏఐ ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా వార్తా పత్రికలు, ప్రచార సాధనాలను తమ జీవిత లక్ష్యాల సాధన కోసం వాడుకొని రాష్ట్ర, దేశ, ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యాభ్యాసం సాగించాలన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తమకు మహేందర్ రెడ్డి ఎంతో సహకరించారని చెప్పారు.
కూకట్పల్లి డిగ్రీ , జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ చందన మాట్లాడుతూ కళాశాలలో 1687 మంది డిగ్రీ విద్యార్థులు, 1700 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.




