09-11-2025 06:16:07 PM
నగదు రహిత వైద్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలి..
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి..
టీపీటీఎఫ్ డిమాండ్..
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సిని ప్రకటించి వెంటనే అమలు చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సకినాలు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణకై ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పే`రివిజన్ కమీషన్ రూపొందించిన పిఆర్‌సి రిపోర్టును ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో దాటవేత ధోరణీని ప్రదర్శిస్తున్నదని, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వివిధ రకాల పెండిరగ్ ఆర్థిక బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. 317 జి.ఓ. ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు 3 సంవత్సరాల తాత్కాలిక బదిలీ కోసం విడుదల చేసిన 190 జి.ఓ. లో మార్పులు చేయాలని, ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ జి.ఓ.25 ప్రకారం చేయాలనే నిబంధనలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం హామీ పడ్డ విధంగా ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులను మంజూరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల, ఉపాధ్యాయుల పెండిరగ్ సమస్యల పరిష్కారం కోసం టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో మూడు దశల పోరాటాలను నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి గిరిజన సంక్షేమ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు.
పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులను తరగతి బోధనకు దూరం చేసే విధంగా నిర్వహించే వృత్యంతర శిక్షణలను నిలిపివేయాలని, వేసవి సెలవుల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలల్లో విద్యారంగానికి సంబంధంలేని, అర్హతలు లేని అధికారులను జిల్లా విద్యాధికారులుగా నియమించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే విడుదల చేయాలని అన్నారు, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రతినిధులు నారాయణమ్మ, డి శ్రీనివాస్, ఎం లక్ష్మయ్య యాదవ్, రాజు, అత్రం భుజంగరావు, రావుల రమేష్, విజయ్, దామెర రాజయ్య, సిద్ధోజు కవిత తదితరులు పాల్గొన్నారు.