నేతన్నలకు అండగా ప్రభుత్వం
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం
- అనిల్ కుమార్ రెడ్డి రూ.22.54 కోట్ల ఆర్థిక సాయం..
ఆలేరు, ఆగస్టు 7 : నేతన్నలకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాయగిరి క్రాస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపు తీసుకురావడంలో క్యూ ఆర్ కోడ్ కీలకమన్నారు.
తదుపరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు.అనంతరం నేతన్న భరోసా పథకం కింద రూ.3.29 కోట్లు, చేనేత రుణమాఫీ పథకం కింద రూ.19.24 కోట్ల చెక్కులను చేనేత కార్మికులకు పంపిణీ చేశారు. ముందుగా చేనేత వస్త్రాల అసలుదనాన్ని గుర్తించేలా క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించడంతో పాటు యునైటెడ్ వే హైదరాబాద్తో డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది చేనేత కార్మికుల పాల్గొన్నారు.






