సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గద్వాల, జూలై 8: పేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంతింటిని అం దించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర రెవె న్యూ,గృహ నిర్మాణ,సమాచార,పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం ధరూర్ మండలం ర్యాలంపాడు పునరావాస గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక,క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన పాల్గొన్నారు.గ్రామానికి చేరుకున్న మంత్రులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బా షా షేక్,ప్రజాప్రతినిధులు,అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలువురు లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.
గ్రామంలో మొత్తం 26 కుటుంబాలు గృహప్రవేశం చేయగా లబ్ధిదారులతో మంత్రులు ముచ్చటించి శుభాకాంక్ష లు తెలియజేస్తూ కానుకలు అందించారు.తదనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.ఎన్నికల హామీల అమలుతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని రెండో విడతలో అర్హులైన ప్రతి కుటుంబానికి 5 ల క్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ఈ సందర్భం గా మంత్రి ఆమోదం ప్రకటించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజల త్యాగం వల్లే సాగునీటి ప్రాజెక్టులు సాకారమయ్యాయని కొనియాడారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ర్యాలంపాడు రిజర్వాయర్ వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందడం వెనుక నిర్వాసిత గ్రామాల ప్రజల త్యాగమే కారణమన్నారు. ర్యాలంపాడు పునరావాస గ్రామానికి 236 ఇండ్లు మంజూరు చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.






