24 April, 2026 | 1:48 AM

ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి

24-04-2026 12:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

భీమదేవరపల్లి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్రానికి ఎన్ని గ్రామాల నుండి ధాన్యం వస్తోంది, టోకెన్ వ్యవస్థ అమలు ఎలా జరుగుతోంది, ధాన్యం నాణ్యతను ఎలా పరీక్షిస్తున్నారు వంటి అంశాలను కలెక్టర్ అధికారులు, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యా నికి సంబంధించి రైతుల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  సంబంధిత కార్యకలాపాలను సహకార సంఘం చైర్మన్ అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కలెక్టర్కు వివరించారు. 

అనంతరం ములుకనూరు సహకార గ్రామీణ పరపతి సంఘాన్ని సందర్శించి, అక్కడి కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవ గాహన పొందారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ములుకనూరు సహకార సంఘం చైర్మన్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, డీసీఎస్వో వాజిద్ అలీ, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఏవో పద్మ, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.