29 April, 2026 | 3:47 AM

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలి

29-04-2026 02:17 AM

తాగునీటి సరఫరా మెరుగ్గా ఉండాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మరింత వేగవంతం కావాలి

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన అవగాహన కల్పించాలని, కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రాన్ని వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షిస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బావులను అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇసుక కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జూన్ 2 నాటికి అధిక సంఖ్యలో గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని, డ్రాప్‌అవుట్స్ లేకుండా చూడాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని పేర్కొన్నారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కల నాటేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, దీని ద్వారా లభించే లాభాలను వివరించాలని ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి తెలిపారు. పెండింగ్లో ఉన్న ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన చోట చెక్డ్యామ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ మహిళా సంఘాలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగంలోకి తేవాలని సూచించారు. 

ఉపాధి హామీ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఎంపీడీవో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంతాజీ, ఆర్టీఓ రాథోడ్ రమేష్, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, ఏడీఏ ఆదిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.