calender_icon.png 3 February, 2026 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా నర్సింహస్వామి కల్యాణం

03-02-2026 12:18:32 AM

భారీగా తరలివచ్చిన భక్తులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 2: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైన స్వామివారి కల్యాణోత్సవం సోమవారం తెల్లవారు జాము వరకు వైభవంగా కొనసాగింది.ముందుగా ఆలయంలో స్థాపన తిరుమంజనం ఇతర పూజాధికాలు నిర్వహించారు. పారాయణీకులతో నిత్య ప్రబంధ పారాయణాలు,యజ్నికులతో నిత్య హవనములు,మూల,మూర్తిమంత్ర అనుస్థానాలు, హవనం పూజలు జరిపించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

స్వామివారి పట్టువస్త్రాలు,కళ్యాణ తలంబ్రాలను ఊరేగింపుగా మెయిన్ రోడ్డు నుంచి ఆలయానికి తీసుకెళ్లారు.తదనంతరం స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు నడుమ తిరుమంజన మహోత్సవం నిర్వహించారు.కళ్యాణ వేదికపై అర్చకులు స్వామివారికి జంధ్యాధారణ చేసి వేదమంత్ర పఠనంతో స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం శిరస్సున అలంకరించిన తంతు కనుల పండువగా సాగింది.అనంతరం మాంగల్య ధారణ గావించారు.ఈ వేడుకలను తిలకించిడానికి ఉబయ రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.కల్యాణోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాగారం సీఐ నాగేశ్వర్ రావు,స్థానిక ఎస్త్స్ర ఈట సైదులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది దరూరి యోగానంద చార్యులు, దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం,నర్సింగ శ్రీనివాస్,శిగ నసీర్,సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, ధర్మకర్తలు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,సోమయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్, బైరబోయిన మహా రాజు, రాగి అనిల్, నన్నూరి శ్రీలేఖ, అర్చకులు, వివిధ గ్రామాల నాయకులు, దేవాదా య అధికారులు తదితరులు పాల్గొన్నారు.