28-12-2025 01:01:06 AM
కార్మికులు ఓ చోట.. డిస్పెన్సరీలు మరో చోట
ఆస్పత్రులకు వెళ్లేందుకు కార్మికుల ఆపసోపాలు
కార్మికులు, చిరుద్యోగులపై రవాణా చార్జీల భారం
దూరభారంతో ప్రైవేట్ ఆస్పత్రులను
ఆశ్రయిస్తున్న వైనం
రాష్ట్రంలో 30శాతం ఈఎస్‌ఐ ఆస్పత్రులు కార్మికులకు దూరంగానే..
పక్క చిత్రంలోనిది.. బోరబండ, బాలానగర్ (న్యూ)కు సంబంధించిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీ. ప్రస్తుతం జీడిమెట్ల సమీపంలో ఈ డిస్పెన్సరీ ఉంది. మొదటి నుంచి ఇక్కడే ఉందా అంటే కాదు. కార్మికులు, చిరుద్యోగులు ఎక్కువగా ఉండే బోరబండలోనే మొన్నటి వరకు ఉండేది. రెండు నెలల క్రితమే దీనిని జీడిమెట్లకు మార్చారు. దీనితో బోరబండ నుంచి ఈఎస్‌ఐ లబ్ధిదారులు జీడిమెట్లలోని డిస్పెన్సరీకి రావాలంటే.. సుమారు 15 కి.మీ దూరం ప్రయా ణం చేయాల్సి వస్తోంది. రెండు బస్సులు మారడం.. అదీ కాదంటే.. చార్జీల భారాన్ని మోస్తూ.. ఆటోలో రావడం కార్మికులకు ఇబ్బందికరంగా మారాయి. వాస్తవానికి బోరబండ, బాలానగర్ (న్యూ) ప్రాంతానికి సమీపంలోనే బోరబండ ప్రాంతంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఉండేది. ఈ డిస్పెన్సరీ పరిధిలో సుమారు 60 వేల మంది కార్మికులు లబ్ధిదారులుగా ఉన్నారు. రవాణా చార్జీలు పెరిగి పోవడంతో ఈఎస్‌ఐ సేవలకు దూరమవుతున్నామని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇదొక్కడే అనుకుంటున్నారా.. కాదు రాష్ట్రంలో సుమారు 30 శాతం ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను కార్మికులు, చిరుద్యోగులకు దూరంగానే ఏర్పాటు చేయడం గమనార్హం.
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : ఈఎస్‌ఐ నిబంధ నల ప్రకారం.. ఏ డిస్పెన్సరీ పరిధిలో ఉండే లబ్ధిదారులు ఆ డిస్పెన్సరీకే వెళ్లాల్సి ఉంటుంది. వేరే డిస్పెన్సరీలలో వారికి చికిత్సలు అందించరు. ఇప్పు డు అకస్మాత్తుగా కార్మికులు, చిరుద్యోగులకు అందుబాటులో ఉండే బోరబండ ప్రాంతం నుంచి సుమారు 15 కి.మీ దూరంలోని జీడిమెట్ల ప్రాంతానికి డిస్పెన్సరీని మార్చడంతో.. అంత దూరం వెళ్లలేక ఈఎస్‌ఐ లబ్ధిదారులు ఊసూరుమంటున్నారు.
గతంలో బోరబండలో ఈ డిస్పెన్సరీ ఉన్నప్పుడు కనీసం రోజు కు 100 మందికిపైగా లబ్ధిదారులు వచ్చి.. చికిత్సపొందడం, మందులు తీసుకునేవారు. ఇప్పుడు కార్మికులకు దూరంగా.. ఎక్కడో 15 కి.మీ దూరానికిపైగా డిస్పెన్సరీని మార్చడంతో.. రోజుకు 30 నుంచి 40 మంది రావడం గగనంగా మారింది. రాష్ట్ర ఈఎస్‌ఐలో పైస్థాయి అధికారులు తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలు ఈఎస్‌ఐ లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం అటుంచితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలుకూడా అందకుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మూడో వంతు
డిస్పెన్సరీలు దూరంగానే..
అయితే ఇదొక్కటే డిస్పెన్సరీ ఇలా కాదు.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 70 డిస్పెన్సరీల్లో సుమారు 25 నుంచి 30 శాతం వరకు డిస్పెన్సరీలు ఇలాగే ఉన్నాయి. సనత్‌నగర్ 1, 2 డిస్పెన్సరీలను అమీర్‌పేటకు మార్చారు. అలాగే ఖైరతాబాద్ డిస్పెన్సరీ వాస్తవానికి హైటెక్ సిటీలో ఉండాలి. కానీ పేరు ఒకటే కదా అని.. ఖైరతాబాద్‌కు మార్చారు. దీనితో హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉండే కార్మికులు, చిరుద్యోగులు ఖైరతాబాద్ వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇక హిమ్మత్‌పురా డిస్పెన్సరీని డబీర్‌పురాకు, హబ్సీగూడా డిస్పెన్సరీని నాచారంకు, పాటిఘన్‌పూర్ డిస్పెన్సరీని ఆర్‌సీపురంకు, బాలానగర్ డిస్పెన్సరీని ఫతేనగర్‌కు మార్చారు. ఇక సికింద్రాబాద్‌లో ఉండే డిస్పెన్సరీని జూబ్లీబస్టాండ్‌కు సమీపంలోని బాలంరాయికి మార్చారు. అదెక్క డుందో కూడా లబ్ధిదారులకు తెలియదు.
అనాలోచిత నిర్ణయాలతో..
రాష్ట్రంలోని సుమారు కోటి మందికిపైగా లబ్ధిదారులకు (20 లక్షల మందికిపైగా కార్మికులు, చిరుద్యోగులు) వైద్య సేవలు అందిం చే.. ఇలాంటి డిస్పెన్సరీలు రాష్ట్రంలో 70 వర కు ఉన్నాయి. ఇందులో మూడో వంతు డిస్పెన్సరీలు ఆయా ప్రాంతాలకు దూరంగా ఉండటంతో.. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు అవి లబ్ధిదారులకు సేవలు అందించలేకపోతున్నాయి. పైగా డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, వైద్యులకు కూడా అం తదూరం వెళ్లిరావడం అనేది కష్టంగా మా రింది. దీనితో వారంలో మూడు రోజులు పని... మూడు రోజులు డుమ్మా తరహాలో విధులు నిర్వర్తిస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికు లు, చిరు ఉద్యోగులకు దూరంగా ఉన్న డిస్పెన్సరీలను మార్చి.. లబ్ధిదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని, తద్వారా అందించే సేవలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.
తలోదిక్కున లబ్ధిదారులు.. డిస్పెన్సరీలు
వాస్తవానికి కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతానికి దగ్గరలోనే డిస్పెన్సరీలు మొద ట్లో ఏర్పాటు చేశారు. కార్మికుల నివాస ప్రాంతాల్లోనే డిస్పెన్సరీలను తెరిచేవారు. అయితే డిస్పెన్సరీలు నడుపుతున్న భవనాలకు సరిగా అద్దెలను చెల్లించకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. అలాగే ప్రభుత్వ స్థలాలు, భవనాలు ఉన్న ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలకు తరలించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా కార్మికులు చెప్పుకుంటున్నారు. కార్మికులు ఒక దిక్కున ఉంటే.. డిస్పెన్సరీలు మరో దిక్కున వెలుస్తున్నాయి. దీనితో కార్మికులు, చిరుద్యోగులకు అందుబాటులో ఉంచి.. సకాలంలో చికిత్సలు అందించాల్సిన డిస్పెన్సరీలు.. ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అందని ద్రాక్షలా తయారయ్యాయనే చెప్పవచ్చు.