జీఆర్‌ఎంబీ అజెండాను మార్చాల్సిందే
- ఏపీ అభ్యంతరాలను అజెండాలో చేర్చడం సరికాదు
- గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టు లపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) అజెండాలో చేర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని పరి గణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఈ నెల 18న జరగనున్న గోదావరి బోర్డు సమావేశానికి రూపొందించిన అజెండాపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను సమావేశం అజెండాలో చేర్చడాన్ని ఆక్షేపిస్తూ నీటి పారుదల శాఖ బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేయడం ఆక్షేపణీయమని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే కేంద్ర జలసంఘం తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను పరిశీలించి అనుమ తులు మంజూరు చేసిందని తెలిపింది.
ఏపీ వాదనలను పక్కన పెట్టి సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, మళ్లీ అవే అభ్యంతరాలను గోదావరి బోర్డు ఎజెండాలో చేర్చడం సరికాదని స్పష్టంచేసింది. బోర్డు సమావేశం అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను తొలగించాలని, ప్రస్తుత ఎజెండాను వెంటనే సవరించి కొత్త ఎజెండాను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డుకు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతూ గోదావరి బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీంతో 18న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.






