18 July, 2026 | 4:38 PM

తాజ్ కట్టిన కూలీల చేతులు నరికారు !

16-12-2024 12:10 AM

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్

ముంబై, డిసెంబర్ 15: తాజ్‌మహల్ కట్టిన వారి చేతులను మొఘల్ చక్రవర్తి షాజ హాన్ నరికించాడని, కానీ.. అయోధ్యలో రామమందిరం నిర్మించిన కార్మికులను ప్రధాని మోదీ సన్మానించారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ గుర్తుచేశారు. విదేశీయుల పాలనలోనే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని వెల్లడించారు. ప్రపంచ హిందూ ఆర్థిక వేదిక (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) తాజాగా ముంబైలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇస్లామిక్ దండయాత్రలు, బ్రిటిష్ పాలకుల దాడుల్లో ఎంతో గొప్ప భారత వారసత్వ సంపద ధ్వంసమైందన్నారు.

మోదీ విజన్‌తో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. 2027 నాటికి భారత్‌లో మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని జోస్యం చెప్పారు. శ్రీరాముడు ప్రతిఒక్కరికీ ఆదర్శవంతుడని కీర్తించారు. కిష్కంధను గెలిచిన శ్రీరాముడు ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి బహుమతిగా ఇచ్చాడని, రావణుడిని ఓడించి లంకను విభీషణుడికి అప్పగించాడని కొనియాడారు. రామరాజ్య పాలన వసుధైక పాలన అని, అలాంటి పాలననే బీజేపీ ప్రజలకు అందిస్తున్నదని వ్యాఖ్యానించారు.

ఏడాదికి 16 కోట్ల మంది కాశీ సందర్శిస్తారని, దేశ విదేశాలకు చెందిన సందర్శకులతో ఆదాయం బాగా వస్తుందన్నారు. అయోధ్య రామమందిరం, ప్రయాగ్ రాజ్ మహాకుంభ్, చిత్రకూట్‌లోని తులసీదాస్ జన్మస్థలానికి అదే రీతిలో సందర్శకుల తాకిడి ఉందన్నారు. సందర్శకుల ద్వారా గణనీయమైన ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్న దన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ కూడా ముఖ్యభూమిక పోషిస్తున్నదని స్పష్టం చేశారు.