17 May, 2026 | 1:20 AM

పెట్రో ధరల పెంపు సరికాదు

17-05-2026 12:00 AM
  1. కేంద్రం సామాన్యుల నడ్డి విరచింది
  2. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది
  3. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే..
  4. పదేళ్లుగా పతనమవుతున్న రూపాయి విలువ
  5. ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ.. పెట్రోల్, డీజిల్ రేట్లను తాజాగా పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని అన్నారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ.. ఇప్పుడు అది పరాకాష్ఠకు చేరిందన్నారు.

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం విమర్శించారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందన్నారు.

పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని, ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందన్నారు.  ప్రపంచంలో భారత్‌ను  మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుం టున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని రేవంత్ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచబోం’ అని పదే పదే ప్రకటించిందని గుర్తుచేశారు.

ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతుకం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.