calender_icon.png 14 July, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలక్షణ నటుడు ఇక లేరు

14-07-2025 02:21:03 AM

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవా రు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. వయసు పైబడటం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ చనిపో యారు. 1968లో రుక్మిణిని పెళ్లి చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. 2010, జూన్ 21న ఆయన కుమారుడు వేంకట ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయా రు. కాగా, కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి.

ఫిల్మ్‌న గర్‌లోని కోట నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

బ్యాంక్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. 

1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు తండ్రి సీతారామ ఆంజనేయులు వృత్తిరీత్యా వైద్యుడు. తండ్రి వృత్తినే అనుసరించాలనే కోరిక ఉన్నప్పటికీ కళల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా కళాశాల రోజుల్లోనే నాటకాల ద్వారా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు కోట. కొంతకాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా కూడా పనిచేశారు. బీఎస్సీ చదువుతూ రంగస్థలంపై తాను సాధించిన అనుభవం ఆయనకు సినిమా పరిశ్రమలోకి ద్వారాలు తెరిచింది.

దర్శక నిర్మాత క్రాంతికుమార్.. వెండితెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1978లో తెలుగులో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 750కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తన నటనతో మెప్పించారు. విలన్‌గా భయపెట్టినా, కామెడీతో నవ్వించినా, తండ్రిగా కంటతడి పెట్టించినా తెలుగు సినీచరిత్రలో కోట శ్రీనివాసరావుది చెరగని ముద్ర. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్ వంటి ప్రముఖులతోపాటు బాబుమోహన్‌తో కలిసి చేసిన సుమారు 60 సినిమాలు.. ఆయన నటనకు శాశ్వత గుర్తింపునిచ్చాయి.

ఆయన నటించిన వాటిలో ‘అహ నా పెళ్లంట’, ‘గాయం’, ‘మనీ’, ‘ఆ నలుగురు’, ‘బొమ్మరిల్లు’, ‘కృష్ణం వందే జగద్గురుం’ వంటి సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. 2003లో తమిళంలో ‘సామి’తో, 2023లో కన్నడలో ‘కబ్జా’తో చివరిసారిగా కనిపించారు. తొమ్మిది నంది అవార్డులు అందుకున్న ఆయన కీర్తి కిరీటంలో 2015లో ‘పద్మశ్రీ’ కూడా చేరింది. మరెన్నో అవార్డులు, సత్కారాలు కూడా లభించాయి. కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా, కొన్ని పాటలు కూడా పాడిన ఆయనలో ఉన్న బహుముఖ ప్రతిభను ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. కోట రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు.