14-07-2025 02:15:42 AM
భారతీయ సినిమాకు ఎనలేని కృషి చేసి న దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతి తో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైం ది. ఆయనతో వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధాన్ని కలిగిన సినీ, రాజకీయ ప్రముఖు లు తమ సంతాపం తెలియజేశారు. కొంద రు ప్రత్యక్షంగా వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సానుభూతి ప్రకటించారు. నటులు మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రవితేజ, మంచు మనోజ్, నారా రోహిత్, విశాల్, సాయిదుర్గా తేజ్, ప్రకాశ్‌రాజ్, దర్శకుడు రాంగోపాల్‌వర్మ తదితరులు సానుభూతి ప్రకటించారు.
ముఖ్యంగా నటుడు బాబుమోహన్.. కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని చూస్తూ ఏడ్చిన క్షణాలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. ఫిల్మ్‌నగర్‌లోని కోట నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించిన అనంతరం బాబుమోహన్ మాట్లాడారు. “ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు. ఇద్దరం కలిసి సినిమాల్లోనే కాదు, బయట కూడా సరదాగా ఉండేవాళ్లం. రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్లిపోయాడు. ఇంటికొస్తే ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయనకు అన్నదమ్ములున్నా, నన్నే సొంత తమ్ముడిగా భావించేవాడు. ఏ ఊరుకు షూటింగ్‌కు వెళ్లి నా, పక్కపక్క గదుల్లోనే ఉండేవాళ్లం. ఇ లా మా జీవితంలో జ్ఞాపకాలు ఉన్నాయి’ అ ని బాబుమోహన్ కన్నీటి పర్యంతమయ్యా రు.
తెలుగు భాష.. యాస తెలిసిన నటుడు: పవన్ కల్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న మైన పాత్రలు పోషించారు. తెలుగు భాష.. యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రతి పాత్రలో ఒదిగిపోయారు. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’లో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కలిసి నటించాం. కోట డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
విలక్షణ నటనకు పరిపూర్ణ రూపం: చిరంజీవి
విలక్షణ నటనకు పరిపూర్ణ రూపం కోట శ్రీనివాసరావు. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప నటుడు. మా ఇద్దరి నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’తో ప్రారంభమైంది. మా అనుబంధం ఎంతో పెనవేసుకుంది. తెరమీద నటనే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయన హాస్య చమత్కారం అద్భుతం. ఆయన చేయలేని క్యారెక్టర్ లేదు. ఆయనకు అన్ని మాండలికాలు వచ్చు. కోట శ్రీనివాసరావు లేరనేది వారి కుటుంబానికే కాదు పరిశ్రమకూ తీరని లోటు. అలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు మళ్లీ వస్తారని నేను అనుకోవటంలేదు.
మాటల్లో చెప్పలేని దుఃఖాన్ని కలిగించింది: మోహన్‌బాబు
ప్రియమైన కోట.. మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాం. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసును ఎప్పటికీ మరిచిపోలేం. మాటల్లో చెప్పలేని దుఃఖం కలుగుతోంది.
కోట పాత్రలు చిరస్మరణీయం: రామ్‌చరణ్
సినీ పరిశ్రమ కోట శ్రీనివాస రావు లాంటి విలక్షణ నటుడిని కోల్పోయింది. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు. మన హృదయాల్లో నిలిచిపోయేలా ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఎనలేని నటనా చాతుర్యం: ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావు.. ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ప్రతి పాత్రకు ప్రాణం పోసిన లెజెండ్: రాజమౌళి కోట శ్రీనివాసరావు మరణ వార్త నన్నెంతో కలచివేసింది. నటనలో నిష్ణాతుడు, పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన లెజెండ్.
ఎప్పటికీ సజీవంగానే ఉంటారు: విష్ణు మంచు
మాటల్లో చెప్పలేనటువంటి ఓ గొప్ప నటుడు, లెజెండ్. కోట శ్రీనివాస్ అసమాన ప్రతిభ.. ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ వెలుగు నింపింది. ప్రతి పాత్రలోనూ ప్రాణం పోశారు. అలాంటి అరుదైన ప్రతిభ కొద్దిమందికే దక్కుతుంది. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఇంకా చాలా సినిమాల్లో ఆయనను చూస్తూ పెరిగాను. ఆయన నటనే సినిమా పట్ల నాకు ఆరాధన భావనను పెంచింది. మనం ఆయనను శారీరకంగా కోల్పోయి ఉండవచ్చు. కానీ ఆయన కళ, ఆయన నవ్వు, ఆయన ఆత్మ ఆయన అలంకరించిన ప్రతి సన్నివేశంలో సజీవంగా ఉంటాయి.
సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయింది: తనికెళ్ల భరణి
కోట పార్ధివ దేహానికి తనికెళ్ల భరణి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “సినీ పరిశ్రమలో ‘కోట’ కూలిపోయింది. ఆయనతో వ్యక్తిగతంగా నాకు దశాబ్దాలకుపైగా పరిచయం ఉంది. సామాన్య మధ్యతరగతిలో పుట్టి అంచెలంచెలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. వేసిన ప్రతి వేషం సంపూర్ణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది. నాటకాలు అంటే కోట శ్రీనివాసరావుకు ఎనలేని ఆసక్తి. అదే ఆయన సినీరంగ ప్రవేశానికి పునాది వేసింది” అన్నారు.
నటరాజ పుత్రులు: బ్రహ్మానందం
కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు. కోట శ్రీనివాసరావు నటరాజ పుత్రులు. ఏ విషయాన్నైనా నిర్మొ హమాటంగా మాట్లాడే వ్యక్తి. దాదాపు 4 దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశాం.
ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేశాం: కోమటిరెడ్డి
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారని కొనియాడారు. 1999లో ఎమ్మెల్యేలుగా ఇద్దరం పనిచేశామని, ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా పలకరించేవారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు వారి లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
కోట శ్రీనివాసరావు కాల ధర్మం: నరేంద్ర మోదీ
‘సినిమా పట్ల ఆయనకున్న ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. తన అద్భుతమైన ప్రదర్శనలతో కొన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మోదీ పోస్ట్ పెట్టారు.
సినీరంగానికి తీరని లోటు: సీఎం రేవంత్‌రెడ్డి
కోట శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీరంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
అరుదైన నటన కోట సొంతం: చంద్రబాబు నాయుడు
కోట మృతి బాధాకరం. నటన అంటే ఎలా ఉండాలో 40 ఏళ్లపాటు నటించి చూపించారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. 1999లో నేను సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీయే కూటిమి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
విలక్షణ వెండితెర నటుడు: కేసీఆర్
విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడు అని తెలిపారు. ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారని చెప్పారు. సినీరంగం గొప్ప నటు డిని కోల్పోయిందన్నారు.
మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం: వెంకయ్య నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. కోట భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఆయన విలక్షణ నటుడు, మానవతావాది. వందలాది సినిమాల్లో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కా రం కలిగిన నటుడిని కోల్పోయాం.
నాకు ఆత్మీయుడు: కిషన్ రెడ్డి
కోటతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయాలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారు.
వైవిధ్య నటుడు: డిప్యూటీ సీఎం భట్టి
విభన్నమైన పాత్రలతో వైవిధ్యభరిత నటనతో సినిమా అభిమానులను అలరించిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం. కళా సేవ ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం.
అనారోగ్యంతో ఉన్నా వచ్చేవారు:
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్రంగా బాధించింది. అనేక సినిమాల్లో విలక్షణ నటుడిగా, అనేక పాత్రలు పోషించి ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన. అనారోగ్యంతో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు వచ్చేవారు.
ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
ఆవేదనకు గురయ్యా: కేటీఆర్
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణం ఆవేదన కలిగించింది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.