calender_icon.png 14 July, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట కోట ఒరిగింది!

14-07-2025 02:29:52 AM

నటనకు పెట్టని కోట శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు (83) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట అంత్యక్రియలు స్థానిక మహాప్రస్థానంలో జరిగాయి. అంతకుముందు సినీ, రాజకీయ ప్రముఖులు కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగు సినీ యవనికపై కోట చెరగని ముద్ర వేశారు. ఆయన నటనకు గుర్తింపుగా నంది అవార్డులతోపాటు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 

చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు 

పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్‌గా భయపెట్టిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఎన్నో పాత్రల్లో తనదైన నటనతో రక్తికట్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చినవారే కానీ, ఇక్కడ నుంచి ఇతర ఇండస్ట్రీలకు వెళ్లినవారు అరుదు. ఆ అరుదైన ముద్ర వేసిన ఘనత కోట శ్రీనివాసరావుకే దక్కింది. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల తర్వాత ఆ లోటు తీర్చింది ‘కోట’తోనే భర్తీ అయ్యిందనడంలో సందేహం లేదు. 1978లో తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 750కిపైగా చిత్రాల్లో నటించారు.

ముఖ్యంగా అహనా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నం: 786, శివ, బొబ్బిలిరాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు,  అతడు, రేసుగుర్రం లాంటి చిత్రాలెన్నో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, సాయిదుర్గాతేజ్ ఇలా టాలీవుడ్‌లోని అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. తమిళంలో ‘సామి (2003), కన్నడలో ‘కబ్జా (2023) చిత్రం లో చివరిసారిగా కనిపించారు. ఇక తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ కానుంది. పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. 

విభిన్న పాత్రలు.. విలక్షణమైన నటన.. 

హాస్యంతో నవ్వించినా, ప్రతినాయకుడిగా భయపెట్టినా, కుటుంబ పెద్దగా కంటతడి పెట్టించినా.. తెలుగు సినీచరిత్రలో చెరగని ముద్ర వేశారాయన. డైలాగ్ ఏ మాండలికానికి చెందినదైనా పట్టుబట్టి నేర్చుకొని చెప్పడం కోటకున్న ప్రత్యేకత. కోట జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘ప్రతిఘటన’ ఒకటి. ఈ సినిమాలో ఆయన మినిస్టర్ కాశయ్యగా తెలంగాణ యాసలో ‘నమస్తే తమ్మీ..’ అంటూ అదరగొట్టారు. ‘అహ నా పెళ్ళంట’లో పిసినారి లక్ష్మీపతిగా కోట కనిపించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందిన తర్వాత ఆయన తెలుగు బిజీ నటుడు అయిపోయారు. ‘ఆ నలుగురు’, ‘ఆమె’ సినిమాల్లోనూ ఈ తరహా పాత్రల్లోనే కనిపించారు కోట.

ఎక్కువగా కామెడీ విలన్ పాత్రల్లో కనిపించిన ఆయన ‘గణేష్’ చిత్రంలో క్రూరమైన ప్రతినాయకుడిగా భయపెట్టారు. ఆ సినిమాలో ఆయన ఆహార్యం గుండు, భయంకరమైన కళ్లతో చూస్తేనే వణుకు పుట్టేలా ఉంటుంది. ఇక ‘గాయం’లో గురునారాయణ్‌గా ‘గదైతే నేను ఖండిస్తున్నా..’ అంటూ విలక్షణమైన నటనతో కట్టిపడేశారు. ‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్ తండ్రిగా నటించిన కోట శ్రీనివాసరావు ఆ పాత్ర కోసం గాయకుడిగానూ మారారు. ఈ సినిమాలో ఆయన పాడిన ‘మందు బాబులం’ పాట మాస్ ప్రేక్షకులనూ ఇప్పటికీ ఉర్రూతలూగిస్తోంది. ఇతర భాషల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు కోట. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారు. ‘సర్కార్’లో సెల్వన్ మణిగా నటించి అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు. 

బాబు మోహన్‌తో జోడీ..  

కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లది సూపర్ హిట్ కాంబో అనేది అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ ఉంటే చాలు సినిమా సగం విజయాన్ని సాధించినట్టే అనేంతగా నమ్మకం కల్పించిన జోడీ అది. ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ‘మామగారు’లో వీళ్లిద్దరి కామెడీకి అప్పట్లో తెలుగు ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యాయి. 

కీర్తి కిరీటంలో తొమ్మిది నందులు 

కోట శ్రీనివాసరావు నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. విజయశాంతి లీడ్ రోల్ పోషించిన ‘ప్రతిఘటన’ (1985)లో యాదగిరి పాత్రలో మెప్పించి నంది పురస్కారాల స్పెషల్ జ్యూరీని సొంతం చేసుకున్నారు. తర్వాత జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘గాయం’ (1993)లో గురునారాయణ్‌గా, తీర్పు (1994)లో బుచ్చిబాబుగా, లిటిల్ సోల్జర్స్ (1996)లో మేజర్ హరిశ్చంద్ర ప్రసాద్‌గా, వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన గణేష్ (1998)లో సాంబశివుడుగా, పెళ్లున కొత్తలో (2006) వీరరాజు, ఆ నలుగురు (2004)లో కోటయ్యగా మెప్పించడమే కాక ‘చిన్న’ (2000), ‘పృథ్వీ నారాయణ’ (2002) సినిమాల్లోని ఆయన పాత్రలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రానికి సైమా అవార్డు దక్కింది. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.