14-07-2025 10:43:33 AM
సిద్దిపేట క్రైమ్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలోని లోహిత్ సాయి ప్రైవేట్ ఆస్పత్రి పోలీసుల పహారాలు ఉంది. ఆసుపత్రికి అపెండెక్స్ నొప్పితో బాధపడుతు వచ్చిన రోగికి వైద్యులు ఆపరేషన్ చేయగా పరిస్థితి విషమించి మృతి చెందడం వల్ల ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దాంతో భారీ సంఖ్యలో పోలీసులు ఆసుపత్రి చుట్టుముట్టి పహార కాస్తున్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (28) గడిచిన శుక్రవారం తనకి కడుపునొప్పి ఉందంటూ లోహిత్ సాయి ఆసుపత్రికి వెళ్లారు.
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ భాస్కరరావు ఆపరేషన్ చేయాలంటూ సూచించారు. ప్రస్తుతానికి తగ్గించే ప్రయత్నం చేయండని, మరో రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసుకుంటానని రోగి బంధువులు కోరినప్పటికీ అదే రోజు ఆపరేషన్ చేసుకోవాలంటూ ఆదేశించారు. అదే రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించి ఇర్ఫాన్ ను అప్పటికప్పుడు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేశారు. చికిత్స పొందుతున్న ఇర్ఫాన్ ఆదివారం మృతి చెందాడు. మృతుని బంధువులు ఆసుపత్రి పై దాడి చేసే ప్రమాదం ఉందంటూ ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులను అనుసరించారు. ఇర్ఫాన్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.