ఆచార్య జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ, ఆగష్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు స్ఫూర్తిదాయకం అని హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదారని, ప్రొఫెసర్ జయశంకర్ అధికారికంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఉద్యమాల వెనుక మేధావుల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎన్నో ఉద్యమాలలో ఉపాధ్యాయులు పాత్ర, సైద్ధాంతిక మార్గదర్శకం ద్వారా విజయవంతం అయ్యాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన తర్వాత తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనాన్ని 1952లోనే గుర్తించి 1969 లో వచ్చిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆచార్య జయశంకర్ క్రియాశీలక పాత్రను పోషించారని అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచి, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడంలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలు మనకెంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.






