కలెక్టరేట్‌లొ అడ్రస్ బోర్డ్ ఏర్పాటు
హమ్మయ్య.. అడుక్కోవాల్సిన గోస తప్పింది
మహబూబాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల కార్యాలయం అడ్రస్ కోసం ఇక అడుక్కోవాల్సిన గోస తొలగిపోయింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులకు మూడు అంతస్తుల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి 2023లో సుమారు 60 కోట్లతో అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్ (ఐడీవోసీ) నిర్మించి ప్రారంభించారు.
ఇందులో 40 పైగా ప్రభుత్వ శాఖల అధికారులకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే గత మూడేళ్లుగా కలెక్టరేట్ లో ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏ ఫ్లోర్లో ఏర్పాటు చేశారనే విషయం ప్రజలకు తెలిపే నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం వివిధ పనులపై వచ్చే ప్రజలు ఆయా శాఖల అధికారుల కార్యాలయాల అడ్రస్ కోసం అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడేది. ఇతర జిల్లా కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటూ వివిధ సంఘాలు అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని విజయక్రాంతి పత్రికలో ఇటీవల ‘అడ్రస్ కోసం అడుక్కోవాల్సిందేనా?’, కలెక్టరేట్లో ఈ కార్యాలయం ఎక్కడో, ఏర్పాటు చేయని వివరాల బోర్డు అనే శీర్షికతో ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీనికి స్పందించిన అధికారులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్ వద్ద కార్యాలయాల సంబంధించిన వివరాలను తెలుపుతూ, ఆయా శాఖల కార్యాలయాలు ఏ ఫ్లోర్లో ఉన్నాయో తెలుపుతూ, గదుల వారీగా వివరాలను నమోదు చేసి ప్రత్యేకంగా రూపొందించిన బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఏర్పాటు వల్ల ప్రజలకు ఆయా కార్యాలయాల చిరునామా సులువుగా తెలుసుకోవడంతో పాటు, నేరుగా అక్కడికి వెళ్లే వెసులుబాటు కలిగిందని తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ ఫోరం స్టేట్ కో కన్వీనర్ మైసా శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.






