20 August, 2026 | 4:05 PM

శ్రీచైతన్య, నారాయణ గుర్తింపును రద్దుచేయాలి

08-12-2024 01:39 AM
  1. ఫీజులు, ర్యాంక్‌లే లక్ష్యంగా చదువులు
  2. ఒత్తిడి భరించలేక విద్యార్థుల ఆత్మహత్యలు
  3. ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
  4. విద్యాసంస్థల అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): శ్రీచైతన్య, నారాయణ, కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయడంతో పాటు ఆ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందిం చాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలతో సంబంధం ఉన్న అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలన్నారు. ఫీజుల వేధింపులు, ర్యాంకులు, మార్కుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు, రివిజన్ పేరిట చదివిస్తుండటంతో ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన..

దీనికితోడు ఈ కాలేజీల్లోని పలువురు లెక్చరర్లు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. రూ.లక్ష ల్లో ఫీజులు వసూలు చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వచ్చే ఏడాదికి సంబంధించి ఇప్పటినుంచే ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభు త్వ అనుమతి లేకపోయినప్పటికీ హాస్టళ్లను పెట్టి రూ.లక్షల ఫీజు దండుకుంటునన్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

తన విద్యాసంస్థల్లో విద్యార్థులు చనిపోతున్నా ఆంధ్రపదేశ్ మంత్రి, విద్యాసంస్థల ఫౌండర్ నారాయణ స్పందించడం లేదని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ నారాయణ ఆయన మం త్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్‌బోర్డు డైరెక్టర్ కృష్ణాదిత్యకు వినితిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, సహాయ కార్యదర్శులు.. దామెర కిరణ్, అశోక్‌రెడ్డి, హైద రాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, నాయకులు.. చరణశ్రీ, శ్రీమాన్, నాగేందర్, గుండె శివ, స్టాలిన్, లిఖిత్‌కుమార్, విఘ్నేష్, మనోజ్, అరుణ్, లక్ష్మణ్, భగత్ పాల్గొన్నారు.