క్షయ బాధితులను దత్తత తీసుకోవాలి
* కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి.....
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): క్షయ వ్యాధిగ్రస్తులను ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీకిషన్ రెడ్డి కోరారు. క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొబైల్ మెడికల్ యూనిట్లను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డలోని టీబీ దవాఖానలో శనివారం రాష్ట్రంలోని 9 జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన కోసం 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 347 జిల్లాలలో 100 రోజుల నిక్షయ్ శివిర్ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద టీబీ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయంలో పోషకాహారం కోసం నెలవారీ ఇచ్చే రూ. 500ను కేంద్ర ప్రభుత్వం రూ.1000కి పెంచిందన్నారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.




