15-01-2026 12:44:39 AM
ప్రాజెక్టు పేరుతో అక్రమ వ్యాపారం
రాత్రికి రాత్రే తరలించి కోట్లు గడిస్తున్న వ్యాపారులు.
పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, మైనింగ్ అధికారుల పట్టింపు శూన్యం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
నాగర్ కర్నూల్ జనవరి 14 (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా పంప్ హౌస్, సంప్ హౌస్, ఓపెన్, అండర్ గ్రౌండ్ కెనాల్, రిజర్వాయర్ పనుల్లో తీసిన భారీ మట్టి, గులకరాళ్లను అక్రమార్కులు అమాంతం మింగేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణ పనులు, ఇతర ప్రాంతాల్లోని సిసి రోడ్డు పనులు, ఇందిరమ్మ ఇల్లు, ఇతర వ్యాపార సముదాయాలు నిర్మాణ రంగాలకు కంకరను రాత్రుల సమయంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మాణం, భూగర్భంలోని సొరంగ మార్గం పటిష్టంగా ఉండేందుకు సిమెంట్ కాంక్రీట్ ద్వారా లైనింగ్ పనులు వంటివి చేపట్టాల్సి ఉంది.
అందుకు తీసిన భారీ గులక రాళ్ళను కంకర, డస్ట్ గా మార్చేందుకు అక్కడే క్రషర్ మిషన్లను ఏర్పాటు చేశారు. అక్కడ తయారైన డస్ట్, 10, 20, 40 ఎంఎం కంకరను ప్రాజెక్టు పనులకు మాత్రమే వాడాలి. మిగిలిన మట్టి, భారీ గులకరాళ్ళను ఇతర వ్యాపారులకు టెండర్ ద్వారా అప్పగించాల్సి ఉంది. తద్వారా ప్రభుత్వానికి సైతం ఆదాయం సమకూరుతుంది. కానీ అధికారులతో అంటకాగుతూ కొంతమంది అక్రమ వ్యాపారులు ప్రాజెక్టు కోసం క్రషర్ ద్వారా తయారు చేసిన కంకరను గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్ళు భారీ వాహనాల చేత తరలించి కోట్లు గడిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ధర 20వేల నుండి 30 వేల దాకా సుమారు ఒక్కో క్రషర్ పాయింట్ నుండి రోజుకు 50 టిప్పర్లకు పైగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాత్రుల సమయంలో భారీ టన్నుల కొద్దీ బరువు గల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరలోని ఇతర క్రషర్ మిషన్ ప్రాంతాలకు సైతం భారీ గులకరాళ్ళను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా పరిశీలించాల్సిన పర్యవేక్షించాల్సిన సదరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి.
పాలమూరు కంకరతో అక్రమార్కుల ఇంట కాసుల పంట.
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు ప్రాంతాన్ని కృష్ణ నీటితో తడిపి సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు పంప్ హౌస్, ఓపెన్ కెనాల్, అండర్ గ్రౌండ్ టనెల్స్, రిజర్వాయర్ల నిర్మాణం కోసం భారీగా తవ్వకాలు జరపగా వెలువడిన భారీ సైజులోని గులకరాళ్ళను తిరిగి ప్రాజెక్టు నిర్మాణం కోసమే వినియోగించాల్సి ఉంది. మిగిలిన మట్టి లేదా కంకర డస్ట్ ఇతర భారీ సైజు గల గులకరాళ్ళను టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
కానీ కొంతమంది వ్యాపారులు రాజకీయ అండదండలతో ఇష్టారీతిగా ప్రాజెక్టు నుండి వెలువడిన భారీ సైజు గల గులకరాళ్లు మట్టి, కంకర, డస్ట్ వంటి విలువైన నిర్మాణ రంగానికి ఉపయోగపడే వాటిని ఇతర ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని కోట్లల్లో గడిస్తున్నారు. ప్రాజెక్టు మొత్తంలో 18 ప్యాకేజీలుగా విభజించగా అందులో 14 సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఉన్నాయి. వీటిపై ఇరిగేషన్ మైనింగ్, రెవెన్యూ పోలీస్ శాఖలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ పనుల పేరు చెప్పి సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రిళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు నుంచే తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపో వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా అంటి ముట్టనట్లు వ్యవహరించడం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తిలా పా పం తలా పిడికెడు అన్న చందంగా ఆయా అధికార, ప్రతిపక్ష, ప్రజాసంఘాలు ఇతర ప్రైవేటు వ్యక్తులు సైతం ప్రాజెక్టు నుండి వెలువడిన ఈ ముడి సరుకును పూర్తిస్థాయిలో మింగేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం
ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రమే వినియోగించాల్సిన కంకర డస్ట్ ఇతర వాటిని ప్రైవేటు వ్యక్తులకు తరలించే ప్రసక్తి లేదు. ఒకవేళ అలా తరలించినట్లు ఫిర్యాదు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం.
- రవీందర్, ఇరిగేషన్ శాఖ, డీఈ నాగర్‌కర్నూల్