11 June, 2026 | 1:00 AM

ఖమ్మంలో బాలికపై దాడి ఘటన అత్యంత హేయం

11-06-2026 12:01 AM

బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం 

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి 

కూసుమంచి, జూన్ 10 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో ఒక బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు.

ప్రతి విషయంలోనూ ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికపై జరిగిన ఈ దాడి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.