15-02-2026 01:16:28 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 14: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అంచనాలను తారుమారు చేశాయి. మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కకపోవడంతో సమీకరణలు మొదలయ్యాయి. ఇందూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లలో గెలిచాయి. దీంతో హస్తం పార్టీ ఎంఐఎం పార్టీ మద్దతుతో మేజిక్ ఫిగర్ 31ని చేరుకుంటుంది.
మరోపక్క బీజేపీ అత్యధికంగా 28 సీట్లు సాధించినా.. ఎక్స్‌అఫీషియో ఓట్లు ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఓట్లు లభించినప్పటికీ సంఖ్య 30ని దాటలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజాతీర్పును గౌరవిస్తాం.. ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడుతామని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. దీంతో మేయర్ పోటీలో తాము లేమని చెప్పకనే చెప్పారు. దీనితో మేజిక్ ఫిగర్‌తో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం బలంగా ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎంతో చర్చించి మేయర్ పీఠాన్ని చేజి క్కించుకోనుంది.
ఒక దశలో ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండా తామే మేయర్ పీఠం దక్కించుకుంటామని ధీమాతో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కి కార్పొరేషన్ ఫలితాలతో చుక్కెదురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమావళి ప్రకారం కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పదవితో పాటు డిప్యూటీ మేయర్ పదవులు చేజిక్కించుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
16 మధ్యాహ్నంలోపు..
ఈనెల 16న మధ్యాహ్నం 12:30 గంటలలోపు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. రేపటిలోగా ఫామ్‌౧౧ నోటీసులు అందించాలని చైర్మన్, వైస్‌చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్-11 నోటీసులు తప్పనిసరిగా అందించాలని తెలిపింది. ఈ యాక్ట్ ప్రకారం 16వ తేదీ మధ్యాహ్నం జరిగే సమావేశానికి ఒకరోజు ముందుగానే సభ్యులకు నోటీసులు అందజేయాలని తెలియజేసింది.
ప్రజాతీర్పును గౌరవిస్తాం: ఎంపీ అరవింద్

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠకు తెరదించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతామని ఆయన స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని, ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఇందూరు ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మాండమైన విజయం బీజేపీకి అందించారని ఎంపీ అరవింద్ తెలిపారు. 40 శాతంపైగా మైనారిటీలు ఉన్నా బీజేపీకి 28సీట్లు రావడం గర్వకారణం అన్నారు. ‘బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ను ఇంటి నుంచి ఎత్తుకు రావడానికి ఏసీపీ, ఎస్సైలు ఉంటారా.. అందుకే వారికి జీతాలిస్తున్నారా.. నా మీద కేసు కాదు నేనే పోలీసులపై కేసు పెట్టాలి. పోలీసులు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తారా? అంటూ పోలీసులపై ఎంపీ అరవింద్ మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు సాగడం లేదని, స్పీడప్ చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రే ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కార్పొరేటర్లను ఎత్తుకుపోవడం చేస్తే బీఅర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. ‘మేము మున్సిపల్ ఫలితాల పట్ల సంతోషంగా గర్వంగా ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని తాము ముందే చెప్పామన్నారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అదే జరగబోతుందని, ఈ ఐదేళ్ల మున్సిపల్ కాలపరిమితి ముగిసేలోగా ఇందూరుగా పేరు మారడం ఖాయమని ఎంపీ అరవింద్ తెలిపారు. ఆర్మూరు ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నామన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ ఆత్మాభిమానం చంపుకుంటోందని ఎంపీ అరవింద్ ఆక్షేపించారు. అక్బరుద్దీన్ తిట్టినా కాంగ్రెస్ వారితో కలవాలనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కోవర్టులను, పార్టీ ద్రోహులను క్షమించేది లేదని ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ఒక బ్రోకర్ పార్టీ అని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తామంటే అది వారిష్టమని చెప్పారు. సాంకేతికంగా తాము ఓడినా బీజేపీ బలం పెరిగిందని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.