బీమా పథకం చారిత్రాత్మకం
- స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు
- బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులమయం
- సమానత్వానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ
- ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలి
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
యాదాద్రి భువనగిరి, మార్చి 22 (విజయక్రాం తి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఆయన జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా ఆదివారం భువనగిరితో ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేరా హోటల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల ప్రమాణ స్వీకా రోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, కులమతాలకు అతీతంగా సమానత్వానికి ప్రతీక ఇచ్చే పార్టీ అన్నా రు. గాంధీ మొదలుకొని ఖర్గే వరకు నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందా అని ప్రశ్నించారు. కానీ బీజేపీ సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను ఓన్ చేసుకోవాలనే తాపత్రయంలో ఉందన్నారు. గాంధీ కు టుంబం గురించి మతోన్మాదులు మాట్లాడటం విచారకరమని, రాహుల్‌గాంధీకి, మోదీకి అసలు పొంత న లేదన్నారు.
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఫలితం తప్పక ఉంటుందని తెలిపారు. జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవికి చేరుకోవడం కాంగ్రెస్‌లోనే సాధ్యమన్నారు. యువత బలిదానాలకు చలించి సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వెల్లడించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల మయంగా మారింద ని ఆరోపించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల నేతృత్వంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్ల దోపిడీ జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.




