అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి
గోవిందరావుపేట, జూలై 10 (విజయ క్రాంతి): అంగన్వాడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రీ-ప్రైమరీ, పీఎం-శ్రీ కేంద్రాల విలీన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18వేల రూపాయల వేతనం అమలు చేయాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
24 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు, పెండింగ్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు, టీఏడీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి ఉద్యోగ భద్రతను ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు.
అనంతరం అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌ఐ మురళికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కమిటీ సభ్యులు కే. పద్మారాణి, ఎస్. భాగ్యమ్మ, ధనలక్ష్మి, సీహెచ్. అరుంధతి, కే. పద్మావతి, పి. సరిత తదితరులు పాల్గొన్నారు.






